ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో ఫార్ములా! ..గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ రూ. 41 కోట్లు

  •  బాండ్ల రూపంలో ఇచ్చిన కార్ రేస్ సంస్థ
  • అనుబంధ సంస్థలతో కలిసి 41 సార్లు రూ. 49  కోట్ల చందాలు
  • వివరాలు బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విడ్‌ ప్రోకో జరిగినట్టుగా  తేల్చింది. బీఆర్ఎస్‌కు రూ.41 కోట్లను బాండ్ల రూపంలో గ్రీన్‌ కో సంస్థ ముట్టచెప్పినట్టు వెల్లడించింది. గ్రీన్ కో కంపెనీ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరినట్లు తెలిపింది. గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు కలిసి 41 సార్లు.. రూ. 49 కోట్ల బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో ఇచ్చినట్టు వెల్లడించింది. 

ALSO READ | ఏసీబీ ఆఫీసు వద్ద అరగంట హై డ్రామా.. వాగ్వాదం.. వెనుదిరిగి వెళ్లిన కేటీఆర్

రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఎన్నికల బాండ్లను గ్రీన్ కో సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య బాండ్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రతి సారి రూ. కోటి విలువ చేసే బాండ్లు గ్రీన్ కో కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.  మొత్తం రూ. 49 కోట్లను ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు గ్రీన్ కో సంస్థ చెల్లింపులు చేసినట్లు తెలిపింది. దీంతో ఫార్ములా ఈ రేస్‌ వల్ల బీఆర్‌ఎస్ పార్టీ లబ్ది పొందినట్లు తేటతెల్లమైన పరిస్థితి.