ఏపీలోని నిరుద్యోగులకు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో నగదు పంపిణీ చేయించొద్దన్న ఈసీ.. ఇప్పుడు కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్ష, టెట్ ఫలితాలు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. దీంతో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న డీఎస్సీ పరీక్ష ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది.
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారులు డీఎస్సీ నిర్వహణకు కొత్త పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు సమాచారం. 6వేల 100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 7న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం మార్చి 30వ తేదీ నుండి పరీక్షలు జరగాల్సి ఉండగా.. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడటంతో నిరుదోగ్యులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. జూన్ 04న ఫలితాలు వెలువడుతాయి.