టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ల తిప్పలు

  •    చివరి ప్రయార్టీగా ఇచ్చిన జిల్లాల్లో సెంటర్  కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 2 నుంచి ప్రారంభం కానున్న టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు తిప్పలు తప్పడం లేదు. వారు పెట్టుకున్న ఫస్ట్ ప్రయార్టీ జిల్లాల్లో కాకుండా.. చివరి ప్రయార్టీ జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులకు వెబ్ సైట్​లో అందుబాటులో పెట్టారు. వీటికి చూసుకున్న చాలామంది షాక్ కు గురయ్యారు. జనవరి 20 వరకూ టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పదిరోజుల పాటు 20 సెషన్లలో జరిగే పరీక్షలకు 2,75,773 మంది పరీక్షలు రాయనున్నారు.

అయితే, టెట్ పరీక్షా కేంద్రాలు వారుంటున్న ప్రాంతాలకు దూరంగా పడ్డాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉమ్మడి జిల్లాలోనైనా అవకాశం ఇవ్వకుండా.. 100 కిలోమీటర్ల దూరంలో సెంటర్లు వేశారని ఆరోపిస్తున్నారు.  ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి.. 16 పరీక్షా కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చుకోగా, అతను ఆప్షనే పెట్టని హన్మకొండలో సెంటర్ పడింది. అదే జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి.. 11వ ఆప్షన్​గా పెట్టుకున్న సిద్దిపేట జిల్లాలో సెంటర్ వేశారు. వేలాది మందికి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.  

20సెషన్లలో పెడుతున్నా.. కనీసం ఉమ్మడి జిల్లాల్లో కూడా సెంటర్లను కేటాయించకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. దీని ప్రభావం అటెండెన్స్​ పై పడే అవకాశం ఉంది. కాగా..జనవరి 11,20వ తేదీల్లో జరిగే టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు సాంకేతిక కారణాలతో గురువారం రాత్రి వెబ్ సైట్లో పెట్టలేదు. వారి హాల్ టికెట్లను ఆదివారం వెబ్ సైట్​లో పెడ్తామని అధికారులు ప్రకటించారు.