ఏపీకి గుడ్ న్యూస్: రాష్ట్రానికి రానున్న ఆటో మొబైల్ దిగ్గజం టెస్లా..

2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో టెస్లా  కార్ల ఉత్పత్తికి సంబంధించిన యూనిట్ చేయాలని ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటుకి కావాల్సినంత ల్యాండ్ బ్యాంక్ ఏపీలో ఉందని, ప్రైవేట్ భూములు కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి తగిన సహకారం ఉంటుందని తెలిపింది.

గతంలో 2021, 2022లో కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఎలాన్ మస్క్ ని ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన ఉన్న నేపథ్యంలో మరోసారి తమ ఆహ్వానాన్ని పంపింది ప్రభుత్వం. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, ఈ ఎన్నికల తర్వాత టెస్లా బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉంది. టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు సుమారు 2500 ఎకరాల భూమి అవసరం అవుతుందని సమాచారం. టెస్లా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏపీతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి.