ఏసీబీకి చిక్కిన టెన్త్​ బెటాలియన్ ఆఫీసర్

  • క్లియరెన్స్​ సర్టిఫికెట్​ కోసం లంచం డిమాండ్​
  • మీడియేటర్​గా వ్యవహరించిన ఏపీ రిటైర్డ్​ ఏఆర్​ ఎస్​ఐ
  • పట్టించిన కానిస్టేబుల్​

అలంపూర్, వెలుగు: ఓ కేసు విషయంలో రూ.50 వేల లంచం తీసుకున్న టెన్త్  బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్​తో పాటు మీడియేటర్ అయిన రిటైర్డ్ ఏఆర్ ఎస్ఐ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ కథనం ప్రకారం...జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలోని టెన్త్  బెటాలియన్ లో కానిస్టేబుల్​గా పని చేస్తున్న గోవర్ధన్​కు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అసిస్టెంట్ కమాండెంట్ నరసింహస్వామి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు.

ఇష్టం లేని గోవర్ధన్ ​ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు నరసింహస్వామిని సంప్రదించగా ఆయన ఏపీ కల్లూరులో ఉన్న ఎస్ఏపీ క్యాంప్ రిటైర్డ్​ ఏఆర్ ​ఎస్ఐ అబ్దుల్ వహాబ్​కు అలంపూర్ చౌరస్తాలో డబ్బులు ఇవ్వాలని కోరాడు. అతడు చెప్పినట్టే రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ రైడ్ చేసి వహాబ్​ను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుంది. తర్వాత అతడిని విచారించగా అసిస్టెంట్​ కమాండెంట్ ​నరసింహస్వామి పేరు చెప్పాడు. దీంతో ఇద్దరిని అరెస్ట్​ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చినట్లు తెలిపారు.