కరోనా వచ్చిన మొదట్లో .. చికెన్, మటన్, చేపల వంటి మాంసాహారం తింటే ఈ వ్యాధి సోకుతుందని పుకార్లు వచ్చాయి. దీంతో కొన్నాళ్లు వీటి అమ్మకాలు పడిపోయాయి. మాంసం వల్ల కరోనా రాదని ప్రభుత్వం , ఇతర కంపెనీలు ప్రచారం చేయడంతో జనం తిరిగి వీటిని ఎప్పటి మాదిరే కొనడం మొదలుపెట్టారని మీట్ వెండింగ్ కంపెనీ ‘‘టెండర్ కట్స్ ’’ సీఈఓ, ఫౌండర్ నిశాంత్ చంద్రన్ అన్నారు. మాంసం అమ్మకాలు, సప్లై, ధరల గురించి ఆయన ‘వెలుగు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు చెప్పారు.
ప్రశ్న: లాక్‌డౌన్ సమయంలో మీ అమ్మకాలు ఎలా ఉన్నాయి ? శుభ్రమైన మాంసం అందించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
మా కంపెనీ హైదరాబాద్, చెన్నై సిటీల్లో ఆర్డర్లు డెలివరీ ఇస్తుంది. లాక్‌డౌన్ కాలంలోనూ అమ్మకాలు నిలకడగానే ఉన్నాయి. యాంటీ బయోటిక్స్, హార్మోన్స్ లేని పరిశుభ్రమైన మాంసాన్ని మేం అందిస్తాం. తాజా మాసం అందించడానికి స్థానిక పశువుల యజమానులతో, జాలర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. సాధారణ మార్కెట్లలో దొరికే మాంసం పరిశుభ్రంగా ఉండదు. అపరిశుభ్ర వాతావరణంలో జంతువులను కోస్తారు. కోల్డ్ చెయిన్ సదుపాయాలు ఉండవు. ఇలాంటి మాంసం తింటే వ్యాధులు వస్తాయి.
మాంసం వల్ల కరోనా సోకుతుందనే పుకార్లు వచ్చాయి. దీనిపై అవగాహన కలిగించారా ?
ఇమ్యూనిటీ ఉంటే కరోనా మన దగ్గరికే రాదు. మాంసం, సీఫుడ్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మా కస్టమర్లకు, బిజినెస్ పార్ట్‌నర్లకు చెప్పాం. వారి అనుమానాలన్నింటినీ తీర్చాం.
లాక్‌డౌన్ వల్ల మీ కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి ?
బోర్డర్లను మూసేయడం వల్ల మొదట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. వాహనాలను ఆపేయడంతో సప్లై చెయిన్ దెబ్బతిన్నది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులూ లేవు. 80 శాతం ఆర్డర్లను డెలివరీ చేస్తున్నాం. ఉద్యోగులు అంతా పనిచేస్తున్నారు.
మాంసం ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్ ?
సప్లై సమస్యల వల్లే ధరలు పెరిగాయి. మేకలను తీసుకొచ్చే వాహనాలను లాక్‌డౌన్ మొదట్లో అడ్డుకున్నారు. దీంతో మటన్ రేట్లు ఎక్కువయ్యాయి. జాలర్లను వేటకు వెళ్లనివ్వడం లేదు. కొన్ని బోట్లు మాత్రమే చేపలు పడుతున్నాయి. దీనివల్ల కొరత ఏర్పడింది. చికెన్ ధరలు మొదట్లో తగ్గాయి కానీ తదనంతరం ఇవీ పెరిగాయి.
లాక్‌డౌన్ తరువాత పరిస్థితి ఎలా ఉండొచ్చు ?
చాలా మంది లాక్‌డౌన్ సమయంలో టెండర్‌కట్స్‌లో కొనడం మొదలుపెట్టారు. మేం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం మాంసాన్ని ప్రాసెస్ చేస్తున్నామని అర్థం చేసుకున్నారు. ఇక నుంచి మా కస్టమర్లలో చాలా మంది బయటి మాంసం జోలికి వెళ్లకపోవచ్చు. మరింత మంది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికేషన్ ఉన్న స్టోర్లలోనే మాంసం కొంటారు. ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మాంసం, చేపలు, గుడ్లు, సీఫుడ్ బాగా తినాలి.
హైదరాబాద్‌లో సేల్స్ ఎలా ఉన్నాయి ?
హైదరాబాద్‌వాసులు యథావిధిగా మాంసం తింటున్నారు. ఇక్కడ ఏటా రూ.3,500 కోట్ల విలువైన మాంసం అమ్ముడవుతుంది. సిటీలో మాకు ఏడు స్టోర్లు ఉన్నాయి. మేం రోజుకు దాదాపు ఐదు వేల ఆర్డర్లు డెలివరీ చేస్తాం. చెన్నైలో 13 స్టోర్లను నడుపుతున్నాం. రెండు సిటీల్లో మాకు ఐదు లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. వీరిలో 15 శాతం మంది తరచూ ఆర్డర్ ఇస్తారు. మేం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ప్రొడక్టులను అమ్ముతాం. కంపెనీ లెవెల్‌లో ఏడాదికి రూ.100 కోట్ల టర్నోవర్ సాధించే దిశగా దూసుకెళ్తున్నాం.
