AP Elections 2024: నువ్వు క‌మ్మోడివేనా అని తిట్టాడు.. గొడవపై వివరణ ఇచ్చిన తెనాలి MLA అభ్యర్ధి

తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్.. సోమవారం(మే 13) ఉదయం ఓటర్‌పై చేయి చేసుకున్న విషయం తెలిసిందే. ఓటు వేసేందుకు స్దానికంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయన క్యూలైన్లో నిల్చోకుండా నేరుగా ఓటు వేసేందుకు వెళ్లబోగా.. అప్పటికే క్యూలైన్‌లో ఉన్న ఓటర్ ఆయనకు అభ్యంతరం తెలిపినట్లు వార్తలొచ్చాయి. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన ఓటర్‌పై చేయి చేసుకోగా.. తిరిగి సదరు వ్యక్తి ఆయనను కొట్టారనేది వస్తున్న కథనాల సారాంశం. అయితే, చేయి చేసుకుంది వాస్తవమైనా.. జరిగింది అది కాదని అన్నాబత్తుని శివకుమార్ వివరణ ఇచ్చారు. 

సదరు ఓటర్ తన సామాజిక వ‌ర్గాన్ని కించపరుస్తూ తనను దుర్భాష‌లాడాడని శివ‌కుమార్‌ తెలిపారు. ఓటరును కొట్టేందుకు దారి తీసిన కారణాల ఏంటనేది ఆయన వివరణ ఇచ్చారు. తెనాలి ఐతాన‌గ‌ర్‌లో గల పోలింగ్ కేంద్రానికి భార్య‌తో క‌లిసి ఓటు వేసేందుకు వెళ్లానని, అక్కడ ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వ‌ర్గాల‌కు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్క‌ల సుధాక‌ర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు శివ‌కుమార్‌ ఆరోపించారు. భార్య ముందే తనను అస‌భ్యంగా ధూషించాడని ఆయన తెలిపారు.

గొట్టిముక్క‌ల సుధాక‌ర్ అనే వ్యక్తి క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన టిడిపి కార్యకర్తని ఆయన అన్నారు. నువ్వు అస‌లు క‌మ్మోడివేనా అంటూ తనను అస‌భ్యంగా దూషించినట్లు ఆయన వివరించారు. మ‌ద్యం మ‌త్తులో పోలింగ్ బూత్ వ‌ద్ద అంద‌రి ముందు తన పట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించాడని ఆయన వివరించారు.

గృహ నిర్బంధంలో ఉంచాల‌ని ఆదేశాలు

ఓటర్ ‌పై చేయి చేసుకున్న ఘటనపై తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి శివ‌కుమార్‌పై ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆయనను వెంట‌నే అదుపులోకి తీసుకోవాల‌ని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్త‌య్యే వ‌ర‌కూ గృహ నిర్బంధంలో ఉంచాల‌ని ఆదేశాలిచ్చింది.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్‌ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది.