ముక్కోటికి ముస్తాబవుతున్న వైష్ణవ ఆలయాలు.. తెల్లవారుజాము 3.30 నుంచే ఉత్తర ద్వార దర్శనాలు

బషీర్ బాగ్/పద్మారావునగర్, వెలుగు: ముక్కోటి ఏకాదశికి గ్రేటర్​లోని వైష్ణవ ఆలయాలు ముస్తాబవుతున్నాయి. నిర్వాహకులు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్లోని టీటీడీ ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల నుంచే స్వామివారి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. జూబ్లీహిల్స్ లో వీఐపీలకు  30 నిమిషాల పాటు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. రెండు ఆలయాల్లో ఉదయం 3:30 నుంచి రాత్రి 10 గంటలకు వరకు నిర్విరామంగా సర్వదర్శనాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

తెల్లవారుజామున ఒంటిగంట నుంచి 3 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువ, పంచాంగ శ్రవణం, ఏకాంత సేవలు నిర్వహిస్తామని, 3:30 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తామన్నారు. ఆలయాల ప్రాంగణంలో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. క్యూ లైన్లలోని భక్తుల కోసం బాదం పాలు అందించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అలాగే తిరుమల నుంచి రెండు ఆలయాలకు అదనంగా 20 వేల చొప్పున లడ్డూలను తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. చిలకలగూడలోని ఆలయాల వద్ద ముక్కోటి శోభ సంతరించుకుంది. నామాలగుండు కల్యాణ వేంకటేశ్వరస్వామి, శ్రీనివాసనగర్‌‌ శ్రీగిరి ప్రసన్న వెంకన్నస్వామి, చిలకలగూడ సాయిబాబా సమేత బాలాంజనేయస్వామి ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.