- ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్‌శర్మను సస్పెండ్ చేయాలి
- హైదరాబాద్‌లో అర్చకుల ఆందోళన
బషీర్‌బాగ్, వెలుగు : అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆభరణాలు మాయం అవుతున్నాయని, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్‌శర్మను సస్పెండ్ చేయాలని ఆలయ అర్చకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్ బొగ్గులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆనంద్‌శర్మ ప్రధాన అర్చకుడిగాఉంటూ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. అమ్మవారికి వచ్చే కానుకలు, ఆభరణాలు మాయం అవుతున్నాయని ఎండోమెంట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
ఓ ఘటనలో అలంపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదుతో ఆనంద్‌శర్మపై కేసు కూడా నమోదు అయిందన్నారు. అతడిని సస్పెండ్ చేయకుంటే అర్చకులతో కలిసి ‘చలో అలంపూర్’కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఆందోళనలో హిందూ ధార్మిక సంఘం నాయకులు పులికల్ అశోక్, వడ్డే రాజు, శేషయ్య, రవీందర్, ప్రసాద్, కొత్త కోట శివ స్వామి పాల్గొన్నారు.