పాట్నా: కొన్ని రోజుల కిందట కనిపించకుండా పోయిన పూజారి.. శవమై తేలారు. ఆయన దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు పూజారి కళ్లను బయటికి తీసేసి.. జననాంగాలను కోసేసి పైశాచికంగా ప్రవర్తించారు. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా దానాపూర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామంలో స్థానికులు, పోలీసులకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. గ్రామస్తుల దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. దానాపూర్‌లోని శివాలయంలో పూజారిగా మనోజ్ కుమార్ సేవలందిస్తున్నారు.
ఆరు రోజుల కిందట ఇంటి నుంచి గుడికి బయల్దేరిన ఆయన.. ఆ తర్వాతి నుంచి కనిపించడం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు అప్పటి నుంచి మనోజ్ కుమార్ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని చెట్ల పొదల్లో ఆయన డెడ్‌బాడీ కనిపించింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే మనోజ్ హత్యకు గురయ్యారంటూ స్థానికులు రాళ్లు రువ్వారు. ఓ పోలీస్ వెహికల్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. గోపాల్ గంజ్ సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ప్రంజల్ అక్కడికి చేరుకుని.. స్థానికులతో మాట్లాడి శాంతింపజేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
