టెంపరేచర్​ డౌన్: రాష్ట్రవ్యాప్తంగా వణికిస్తున్న చలి

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. బుధవారం రాత్రి వనపర్తి మినహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 7 జిల్లాలు ఆరెంజ్​ అలర్ట్​లో ఉండగా.. 25 జిల్లాలు ఎల్లో అలర్ట్​లో కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో 10 డిగ్రీల కన్నా తక్కువ టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్​ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో 7.3, నిర్మల్​లో 8.3, మెదక్​లో 9.4, సంగారెడ్డిలో 9.5, జగిత్యాలలో 9.7, వికారాబాద్​లో 10  డిగ్రీల మేర రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్​, రంగారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్​ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లోనూ 10 నుంచి 10.9 డిగ్రీల మధ్యే టెంపరేచర్లు నమోదయ్యాయి. మిగతా 17 జిల్లాల్లో 11 నుంచి 14.8 డిగ్రీల మధ్యన రాత్రి టెంపరేచర్లు నమోదు  కాగా.. వనపర్తిలో 15.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది.

మరికొన్ని రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. టెంపరేచర్లు మరింత పడిపోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నది. ఉష్ణోగ్రతలు  4 డిగ్రీల వరకు పడిపోతాయని హెచ్చరించింది. ఉత్తరాది జిల్లాలతోపాటు దక్షిణాదిలోని నాలుగైదు జిల్లాలకు చలి ముప్పు ఉంటుందని పేర్కొన్నది.