SA vs SL: వారేవా బవుమా.. గాల్లోకి ఎగిరి మరీ సిక్సర్ కొట్టాడుగా

సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా  చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంటారు. అతను ఆటకు పనికిరాడని.. కెప్టెన్సీ అనవసరంగా ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అతను   ఆడకపోతే ట్రోల్స్, మీమ్స్ చేయడానికి రెడీగా ఉంటారు. ప్రస్తుతం సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బవుమా ఒక సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్ కు  అనుకూలిస్తున్న పిచ్ పై బ్యాటింగ్ లో సత్తా చాటాడు. 

కింగ్స్‌మీడ్‌లో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసి సౌతాఫ్రికా తరపున కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 117 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 70 పరుగులు చేసిన ఈ సఫారీ కెప్టెన్  46వ ఓవర్‌లో అసిత ఫెర్నాండో వేసిన ఒక అద్భుతమైన బంతికి ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుతమైన నాక్ తో పాటు ఒక  సూపర్ షాట్ తో అలరించాడు. లహిరు కుమార వేసిన షార్ట్ బాల్ బంతిని ముందే గ్రహించిన బవుమా గాల్లోకి ఎగిరి అప్పర్ కట్ ఆడాడు. థర్డ్ మ్యాన్ దిశగా ఈ బంతి సిక్సర్ వెళ్ళింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ కు ఈ షాట్ హైలెట్ గా నిలిచింది. 

ఈ మ్యాచ్ లో శ్రీలంక 13.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే ఆలౌట్ అయింది. సఫారీ ఫాస్ట్ బౌలర్లు నిప్పులు చేరగడంతో లంక ఆటగాళ్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. శ్రీలంక 42 పరుగులకే ఆలౌట్ కావడంతో కావడంతో తొలి ఇన్నింగ్స్ లో  సౌతాఫ్రికాకు 149 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ప్రస్తుతం మూడు వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. దీంతో  సౌతాఫ్రికా 249 పరుగుల ఆధిక్యంలో ఉంది.

అంతకముందు ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా కేవలం 191 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లు అద్భుతంగా రాణించడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు పరుగులు చేయడానికి తంటాలు పడ్డారు. కెప్టెన్ టెంబా బవుమా ఒక్కడే 70 పరుగులు చేసి రాణించాడు.