IRE vs SA: అయ్యో బవుమా..ఐర్లాండ్‌తో చివరి వన్డేకు సఫారీ కెప్టెన్ దూరం

ఐర్లాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా చివరి వన్డేకు దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా దూరం కానున్నాడు. మోచేతి గాయం కారణంగా సఫారీ ఈ కెప్టెన్ చివరి వన్డేకు అందుబాటులో ఉండడం లేదు. 34 ఏళ్ల బవుమా.. రెండో వన్డేలో ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేయకుండానే మైదానం వీడాడు. 2022 లో భారత పర్యటనలో బావుమా టీ20 సిరీస్ సమయంలో మోచేతికి గాయం కాగా.. తాజాగా ఆ గాయం తిరగబెట్టింది. 

బవుమా గాయంతో త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్టోబర్ 21న మిర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది. బవుమాతో పాటు ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్ వ్యక్తిగత కారణాల వలన చివరి వన్డేకు దూరం కానున్నాడు. 

ALSO READ | IND vs PAK, Women's T20 World Cup 2024: వికెట్ల వెనుక అద్భుతం.. స్టన్నింగ్ క్యాచ్‌తో ధోనీని గుర్తు చేసిన రిచా

బవుమా స్థానంలో రీజా హెండ్రిక్స్‌ని క్రికెట్ దక్షిణాఫ్రికా ప్రకటించింది. అతని గైర్హాజరీలో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌లో ఆఖరి వన్డే మ్యాచ్‌కు రస్సీ వాన్ డెర్ డుస్సేన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ ను సౌతాఫ్రికా 2-0 ఆధిక్యంలో నిలిచి సిరీస్ గెలుచుకుంది. టీ20 సిరీస్ 1-1 తో డ్రా గా ముగిసింది.