లోపలి మనిషిని చూపించే అంతరంగ వీక్షణం

పై స్థాయికి ఎదిగిన ఒక వ్యక్తిని కలిసినప్పుడో, అతని గురించి విన్నప్పుడో మరింతగా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. వాళ్ళు సాధించిన విజయాలను చూసి వాళ్ళు సమస్యల్ని ఎలా అధిగమించారో, ఎలా ఆదర్శవంతంగా మారారో తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. అలాగని వాళ్ళను కలిసి తీరిగ్గా తెలుసుకునే వెసులుబాటు అందరికీ ఉండదు. దానికి సరియైన మార్గమే – ముఖాముఖి.

మనిషి లోపలి మనిషిని నలుగురికీ పరిచయం చేసే ఒక కార్యక్రమం ఇది. దీనివలన వాళ్ళ ఆలోచనలు తెలుస్తాయి, ఆచరణీయ మార్గాలు బోధపడతాయి. వాటిని అక్కున చేర్చుకుని ముందడుగు వేయొచ్చు. తెలుగు సాహిత్య రంగంలో నిస్వార్థమైన సాహిత్యానికి కట్టుబడి ఉండి, తమ వాదాన్ని జనాలపై రుద్దకుండా, ప్రజల్ని పురోగతివైపు నడిపించే సాహిత్య సృజన చేస్తోన్న కొద్దిమంది అంతరంగాల్ని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. అంతటి గొప్ప సాహసానికి పూనుకున్నారు ప్రముఖ కవి, విమర్శకులు, సంపాదకులు విల్సన్ రావు కొమ్మవరపు. వర్తమాన, వర్ధమాన రచయితల్ని ఇంటర్వ్యూ చేయగలిగిన సమర్థుడు ఆయన. ఈ రంగంలో పొద్దుగూకటమెరుగని  సూర్యుడాయన. ఈ మాట అనడానికి గల కారణాలను ఈ ఇంటర్వ్యూలను చదివితే తెలుస్తుంది.

ఇంటర్వ్యూ అనేది పొడవుగానూ, వెడల్పుగానూ కాక లోతుగా ఉండాలని ఈ పుస్తకంలో ముందుమాట రాసిన ప్రముఖ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ మెంబర్ అయిన ప్రసేన్ అభిప్రాయ పడ్డారు. ఆయన చెప్పినట్లు ఇంటర్వ్యూ అనేది ఆత్మకథ, పరామర్శ కాకూడదు. అలాగని రచయితను ఆకాశానికి ఎత్తేసే ప్రోగ్రాం అంతకన్నా కాకూడదు.

ఈ మాటను విల్సన్ రావు దాదాపు ఆచరించి చూపించారు. 34 మంది సాహితీవేత్తలతో నిర్వహించిన ఇంటర్వ్యూలన్నింటినీ కలిపి “అంతరంగ వీక్షణం” అనే సంకలనం తీసుకొచ్చారు. ఇందులో దాదాపు 800 విలువైన సాహిత్య ప్రశ్నలకు వివిధ సాహిత్యకారుల నుంచి మెరుగైన సమాధానాలు రాబట్టారు. ఇలా రాబట్టడానికి ఆయనెంత కృషి చేశారో దగ్గర్నుంచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది.

ఒక రచయితను ఇంటర్వ్యూ చేయాలంటే ముందుగా ఆ రచయితను చదవాలి. ఆ రచయిత దృష్టి కోణం తెలుసుకోవాలి. అతను సమాజానికి ఏం సూచిస్తున్నాడో కనిపెట్టాలి. అతని అంతరంగంలో నలుగుతున్న సంఘర్షణను వెలికి తీయగలిగే నైపుణ్యం ఉండాలి. ఆ రచయిత గురించి నలుగురికి తెలిస్తే మేలు జరుగుతుందనే నిర్ణయానికి రావాలి. వీటిల్లో ఏ ఒక్కటి మిస్ అయినా అభాసుపాలు కావడం ఖాయం. ఇవన్నీ తెలిసిన విల్సన్ రావు ఎంతో జాగరూకతతో వ్యవహరించారు. తన దృష్టిలో ఉన్న రచయితలను కాకుండా మేలైన సాహితీవేత్తలను ఇంటర్వ్యూ చేయడం నిజంగా గొప్ప విషయం.

దీన్ని ఇలా సంకలనం రూపంలోకి తీసుకురావాలని పట్టుబట్టి, సంపాదకత్వం వహించిన ఈతకోట సుబ్బారావు, డా. సుంకర గోపాలయ్యలు అభినందనీయులు. ఈ ఇంటర్వ్యూలను చదివాక విల్సన్ రావు  శ్రమను, అధ్యయనాన్ని, సాహిత్య జ్ఞానాన్ని తప్పక అభినందిస్తారు.
– దొండపాటి కృష్ణ