భారీగా నల్ల బెల్లం పట్టివేత

లింగాల, వెలుగు : నాటుసారాకు ఉపయోగించే నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెల్కపల్లి ఎక్సైజ్  ఎస్ఐ జనార్ధన్ తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున స్టేట్  టాస్క్ ఫోర్స్  సూపరింటెండెంట్  ప్రదీప్ రావు ఆధ్వర్యంలో రూట్ వాచ్  నిర్వహిస్తుండగా మండలంలోని శాయిన్ పేట గ్రామంలో పిట్టల వెంకటస్వామి ఇంటి ముందు నిలిపి ఉన్న డీసీఎం కనిపించింది. తనిఖీ చేసి 209 బస్తాల( 6,270 కిలోలు) నల్లబెల్లం, 50 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే10 లీటర్ల నాటు సారా పట్టుకున్నారు. పిట్టల వెంకటస్వామి, జిలుగుపల్లి గ్రామానికి చెందిన జూలూరి ప్రసాద్ తో కలిసి బెల్లంతో నాటుసారా అమ్ముతున్నట్లు  ఎస్ఐ తెలిపారు. డీసీఎంతో పాటు నల్ల బెల్లం, పటిక, నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. జూలూరి ప్రసాద్, పిట్టల వెంకటస్వామిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఎక్సైజ్ సీఐ రమణయ్య, ఎక్సైజ్ ఎస్ఐలు బాలరాజు, జనార్ధన్ పాల్గొన్నారు.