ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న గద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణ పనులకు జూన్ 21న మంత్రివర్యులు శంకుస్థాపన చేశారు.
శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో రూ.8 కోట్ల 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పరిపాలన భవనాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
తెల్లాపూర్ మునిసిపాలిటీలో అర్భన్ హెల్త్ సెంటర్ నిర్మాణం 15 రోజుల్లో మొదలు పెడతామని మంత్రి హమీ ఇచ్చారు. చెరువులను, కుంటలను కాపాడుకోవాలని లేదంటే.. భవిష్యత్తు తరాలకు మనుగడ ఉండదని ఆయన హితవు పలికారు.
ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టే ప్రతిపనిలో ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ జెండా స్తంభం, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు.