తెరపైకి సాగునీటి సంఘాలు.. చెరువుల కింద ఏర్పాటుకు సర్కారు కసరత్తు

  • ఎన్నికలు నిర్వహించాలా.. నామినేట్ చేయాలా.. అన్న దానిపై సమాలోచనలు
  • 46 వేల చెరువుల కింద 26 లక్షల ఎకరాలు సాగు
  • రాష్ట్రం ఏర్పడ్డాక సంఘాలను రద్దు చేసిన గత సర్కార్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరోసారి సాగునీటి సంఘాల అంశం తెరపైకి వచ్చింది. సాగునీటి సంఘాల ఏర్పాటుకు సర్కారు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. చెరువులతో పాటు కాల్వల కింద కూడా సాగు నీటి సంఘాలను ఏర్పాటు చేసే అంశంపై సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే, ఎన్నికలు నిర్వహించాలా? లేదంటే నామినేట్ చేయాలా? అన్న దానిపైనా ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. ఇటీవలే వ్యవసాయ కమిషన్.. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఈ దిశగా విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచన వ్యక్తమైనట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. 

ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక రైతులతో చెరువుల కింద సాగు నీటి సంఘాలను ఏర్పాటు చేశారు. కమిటీలనూ ఎన్నుకున్నారు. చెరువుల కింద భూములున్న రైతులు.. నీటి తీరువా కింద కొంత డబ్బు చెల్లించేవారు. ఆ డబ్బుతోనే సంఘాలను నిర్వహించేటోళ్లు. ఇప్పుడు కొత్తగా సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తే నీటి తీరువాను వసూలు చేయాలా? లేదంటే ప్రభుత్వం నుంచే కొంత ఫండ్​ను పెట్టి నిర్వహించాలా? అన్న చర్చ కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం 46,500 చెరువుల కింద దాదాపు 26 లక్షల ఎకరాలకుపైగా భూములు సాగవుతున్నాయి.

సాగునీటి సంఘాల వల్లే  చెరువుల్లో పూడిక తీత
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి సంఘాలు ఉండడంతో.. స్థానిక రైతులే చెరువులు, వాటి కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీల్లో చెత్త, కంపచెట్లు, పూడిక తొలగించి పునరుద్ధరించుకునేవాళ్లు. పొలాలకు నీటి తరలింపులో అడ్డంకులు లేకుండా చూసుకునేవాళ్లు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి సంఘాలన్నింటినీ రద్దు చేసింది. రాష్ట్రంలోని 46,500 చెరువులను పునరుద్ధరిస్తామని చెప్పి మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చింది. రూ.20 వేల కోట్లు ఖర్చు పెట్టి చెరువుల పునరుద్ధరణను చేపట్టింది. అయితే, ఫస్ట్ టర్మ్​లో 70 శాతం చెరువులే పునరుద్ధరణకు నోచుకోగా.. రెండో టర్మ్​లో అది ప్రహసనంగానే మిగిలిపోయింది. 

పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్లలోనే మిషన్​కాకతీయను శాస్త్రీయంగా చేపట్టడం లేదని నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ఎన్​జీఆర్ఐ) 2016లో అప్పటి ప్రభుత్వానికి రిపోర్ట్ కూడా ఇచ్చింది. మిషన్ కాకతీయకు కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయని, ఆ పథకం కమీషన్ల కాకతీయగా మారిపోయిందన్న ఆరోపణలూ వెల్లువెత్తాయి. రెండో టర్మ్​లో చెరువుల పునరుద్ధరణను అరకొరగా చేపట్టడంతో పొలాలకు నీరందని పరిస్థితి ఏర్పడింది. 

500కు పైగా సంఘాల ఏర్పాటుకు చర్చ
రద్దు చేసిన సాగునీటి సంఘాలను మళ్లీ ఏర్పాటు చేస్తే.. రైతులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు చెప్తున్నారు. గతంలో ఎన్నికలు నిర్వహించగా ఘర్షణలు జరిగేవి. దీంతో ఈసారి ఎన్నికలు నిర్వహించి సాగునీటి సంఘాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందా? లేదా నామినేట్ చేయాలా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఘర్షణలకు తావివ్వకుండా సంఘాలను నామినేట్ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. 

500కుపైగా సాగునీటి సంఘాలు, కమిటీలను ఏర్పాటు చేస్తే స్థానికంగా ఉన్న కింది స్థాయి లీడర్లకూ రాజకీయంగా లబ్ధి చేకూరుతుందన్న చర్చ కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ సంఘాలతో చెరువులతో పాటు కాల్వల నిర్వహణ బాధ్యతలూ అప్పగించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కాల్వల నిర్వహణ కోసం లష్కర్లను నియమిస్తున్న సర్కారు.. వారికి తోడుగా ఈ సంఘాలను వినియోగించుకుంటే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్టు చెప్తున్నారు. తద్వారా ఇటు చెరువులను పునరుద్ధరించడంతో పాటు కాల్వలను పటిష్టంగా ఉంచుకునేందుకు వీలవుతుందని అంటున్నారు.