తెలంగాణ టీడీపీకి కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా

తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి షాక్​ తగిలింది. తెలంగాణ టీడీపీకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీకి నిరాకరించినందునే టీడీపీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మనస్తాపంతోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు, తన రాజీనామా విషయం చంద్రబాబుకు పంపించానని తెలిపారు.

తెలంగాణలో పోటీ చేయాలని పార్టీ క్యాడర్‌ కోరుతున్నారని.. నారా లోకేష్‌కు 20 సార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదని కాసాని జ్ఞానేశ్వర్‌ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వద్దని చంద్రబాబు చెప్పారని తెలిపారు. కొన్నేళ్లుగా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం పని చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు చెప్పిన మాట వినగానే ఏం అనాలో తనకు తెలియలేదని, తాను రాకముందే తెలంగాణ టీడీపీ బలంగా లేదన్నారు. కార్యకర్తలు మాత్రం పోటీ చేయాలనే బలమైన ఆకాంక్ష వ్యక్తం చేశారని తెలిపారు. పార్టీలో ఉన్నవారికి అన్యాయం చేయడం సరైంది కాదని, పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.