మహిళలపై కామెంట్లు..కేటీఆర్​కు నోటీసులు

  • మహిళలపై కామెంట్లు..కేటీఆర్​కు నోటీసులు
  • 24న హాజరై వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ ఆదేశం
  • అవి యథాలాపంగా చేసిన కామెంట్లు: కేటీఆర్ 
  • ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పినట్టు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు : మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఎంక్వైరీ ప్రారంభించింది. కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్.. శుక్రవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరై, ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు కేటీఆర్‌‌‌‌ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాల, వివిధ పార్టీల మహిళా నేతలు మండిపడుతున్నారు. 

దురుద్దేశంతో అనలేదు : కేటీఆర్ 

ఆర్టీసీ బస్సులు ఎక్కి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండంటూ మహిళలపై చేసిన వ్యాఖ్యల విషయంలో కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆ మాటలు తాను యథాలాపంగా అన్నానని, అందులో దురుద్దేశమేమీ లేదని చెప్పారు. ఇప్పటికే మహిళలకు క్షమాపణలు కూడా చెప్పానని శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో జరిగిన ప్రెస్‌‌మీట్‌‌లో పేర్కొన్నారు.

‘‘నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగి తే, నేను  విచారం వ్యక్తం చేస్తున్నాను. నా అక్కాచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు” అని శుక్రవారం ఉదయం కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ప్రెస్‌‌ మీట్‌‌లో రిపోర్టర్లు ప్రశ్నించగా.. ఆ విషయమై తాను ఇప్పటికే మహిళలకు క్షమాపణలు చెప్పానని కేటీఆర్ పేర్కొన్నారు.