ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు

 సబ్బండ వర్గాలు ఉద్యమించి తెచ్చుకున్న తెలంగాణ మొదటి పదేండ్ల  బీఆర్ఎస్ గడీల పాలనలో ఆగమైపోయింది. అధికారం ఫామ్​హౌస్​కే  పరిమితమై అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలింది.  రాష్ట్ర ప్రగతి దారితప్పగా, ఇప్పుడు ఏడాది కాంగ్రెస్ పాలనలో  పట్టాలెక్కి పురోగతిలో సాగుతోంది.  నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఉద్యమించి, రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ సమాజం సొంత పాలకుల చేతిలోనే  దగా పడింది. సెంటిమెంట్​తో  రెండు విడతలు  అధికారంలోకి  వచ్చిన కేసీఆర్  కపట నాటకాలను పసిగట్టిన ప్రజలు మూడోమారు బీఆర్ఎస్​కు  మరో అవకాశం ఇవ్వకుండా ఆయన ఆటలకు ముగింపు పలికారు.  మాటకు కట్టుబడి దాన్ని ఇచ్చింది  సోనియా గాంధీ  అని విశ్వసించి  యావత్  తెలంగాణ సమాజం అధికారాన్ని కాంగ్రెస్​కు  కట్టబెట్టింది. 


ప్రజల  ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తున్న కాంగ్రెస్ ‘ప్రజాపాలన  ప్రజా విజయోత్సవాలు’ జరుపుకుంటుంటే ‘ఏమి చేశారని..? ఈ విజయోత్సవాలు’ అంటూ ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్,  బీజేపీ పార్టీలకు ఈ ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి -సంక్షేమ పనులు,  కార్యక్రమాలే సరైన సమాధానమని గర్వంగా మేం చెప్పగలుగుతున్నాం.  

అధికారంలోకి వచ్చినరెండో రోజే మహాలక్ష్మి పథకం

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తమైన నిరుపేదల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఆరు గ్యారెంటీలను ప్రకటించిన కాంగ్రెస్ వాటిలో చాలామటుకు అమలు పరుస్తూ,  మిగిలిన వాటిని కూడా పూర్తి చేయడానికి కృషి చేస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి ఇప్పటి వరకు 110 కోట్ల ఉచిత బస్ టికెట్లిచ్చింది. తద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేసిన కాంగ్రెస్ ‘మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం’ అని నిరూపించుకుంది. మహాలక్ష్మిలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేయడంతోపాటు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ను  కూడా అమలు చేస్తోంది.  మహిళా స్వయం సహాయక సంఘాలకు, పారిశ్రామికవేత్తలకు రుణాలు అందజేసి కనీసం లక్ష మంది మహిళా కోటీశ్వరులను సృష్టించాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. పేదలకు ఆరోగ్యం అందుబాటులో ఉండేలా రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ప్రతి వ్యక్తికి రూ.10 లక్షల యూనివర్సల్ హెల్త్ కేర్​ను  కాంగ్రెస్ అందుబాటులోకి తెచ్చింది.  

తిండిగింజలు పండించే రైతులే సమాజానికి పునాది అని విశ్వసించే కాంగ్రెస్ ఎన్నికల ముందు వరంగల్ సభలో రాహుల్ గాంధీ నోటితో ప్రకటింపజేసిన ‘రైతు డిక్లరేషన్’ కు కట్టుబడి ఉంది.  డిక్లరేషన్ హామీ ప్రకారం రూ. 2 లక్షల రుణమాఫీ పథకంలో భాగంగా 25,35,964 మంది రైతులకు రూ.20,616.89 కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది. 31 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని సేకరించిన ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తోంది. రైతు భరోసా కింద ఇప్పటికే రూ.7625 కోట్లు ఖర్చు చేసింది.  సంక్రాంతి తర్వాత మరింత పెద్ద ఎత్తున చేపట్టే కార్యాచరణను రూపొందిస్తోంది.  రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది.   ‘మాది రైతు పక్షపాతి ప్రభుత్వం’ అని నిరూపిస్తూ ఇటీవల మహబూబ్​నగర్​లో  ‘రైతు పండుగ’ను విజయవంతంగా నిర్వహించింది. 
 
యువతకు ఉద్యోగాలు

రాష్ట్ర సాధనలో ప్రాణాలకు తెగించి కొట్లాడిన యువత ఉ ద్యోగాలపై కోటి ఆశలు పెట్టుకుంటే,  పదేండ్ల కేసీఆర్ పాలన వారి ఆశలను వమ్ము చేసింది.  కేసీఆర్ ఆయన కుటుంబంలోని నలుగురు నేతలకు రాజకీయ ఉపాధి కల్పించారు తప్ప లక్షలాది యువతను నిర్లక్ష్యం చేశారు. ఇందుకు భిన్నంగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించింది. 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించింది. పోలీస్ శాఖలో 16 వేలకు పైగా, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 8 వేలకు పైగా, వైద్య శాఖలో 3 వేలకు పైగా నియామకాలు చేపట్టింది. 13 సంవత్సరాల తర్వాత విజయవంతంగా గ్రూప్ -1 పరీక్షలను నిర్వహించాం. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందో గుండెమీద చెయ్యి వేసుకొని చెప్పుకోగలదా..? నియామకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా..  జాబ్ క్యాలెండర్ను ప్రకటించి, నియామక ప్రక్రియను సజావుగా సాగిస్తూ యువత విశ్వాసాన్ని కాంగ్రెస్ చూరగొన్నది. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాల్లో 100 కోట్ల రూపాయల నిధులతో ‘యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ ప్రారంభానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డూ అదుపు లేకుండా సాగిన మాదక ద్రవ్యాల సరఫరాను అరికట్టేలా, ఎంతటి పెద్దవారినైనా వదిలిపెట్టకుండా కఠిన నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటోంది. 

తెలంగాణను అప్పులు పాల్జేసిన కేసీఆర్​

బీఆర్ఎస్ అధినేతలు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల రూపాయలను స్వాహా చేశారే తప్ప సాగునీటి రంగానికి చేసిందేమీ లేదు. ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలను అక్రమంగా కొల్లగొట్టిన బీఆర్ఎస్ పనులను అసంపూర్తిగా మిగిల్చింది.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తూ ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడంతో... 1947 నుంచి ఏ రాష్ట్రానికీ సాధ్యం కాని రీతిన రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తి చేయగలిగింది. చెరువులను పునరుద్ధరించే క్రమంలో ‘హైడ్రా’ను నెలకొల్పి భూదురాక్రమణలను, అక్రమ కట్టడాలను అరికట్టింది.  2014 జూన్ 2న రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్​తో ఉండగా,  పదేండ్ల  తర్వాత కాంగ్రెస్ అధికారం చేపట్టేనాటికి రాష్ట్రం రూ.7 లక్షల కోట్ల అప్పుతో మిగిలింది. కేసీఆర్ చేసిన అప్పులతో ప్రస్తుతం ప్రతి నెల రూ. 6500 కోట్ల అసలు, మిత్తీ చెల్లించాల్సిన దుస్థితి దాపురించింది.

రెండో రాజధాని దిశగా వరంగల్​లో అభివృద్ధి

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​లతో పాటు నాలుగో నగరాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టింది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కరవుతున్న నగరంలో ఆహ్లాదకరమైన పచ్చదనం నెలకొల్పేలా చర్యలు చేపడుతూ, మూసీ సుందరీకరణ, పునరుద్ధరణ పనులు చేపట్టింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతోంది. నగరానికి మణిహారమైన మెట్రో రైలును పాతబస్తీతో సహా నగరం నలువైపులా నడిపించేలా ప్రణాళికలు రూపొందించి,  పనులు వేగవంతం చేసింది. అభివృద్ధిని ఒక్క హైదరాబాద్​కే  పరిమితం చేయకుండా ఇతర జిల్లాల్లో కూడా ప్రాంతీయ రింగ్ రోడ్లను అభివృద్ధి చేస్తోంది. వరంగల్​ను  రెండో రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా అక్కడ భారీ ప్రాజెక్టులు చేపడుతోంది. 

పాలనలో తెలంగాణ స్ఫూర్తి

రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణతోపాటు రాష్ట్ర గౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటోంది.  తెలంగాణ స్ఫూర్తిని, ఐక్యతను చాటేలా రూపొందించిన తెలంగాణ గీతానికి పెద్ద పీట వేసింది. కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే మార్గదర్శకంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సహా రాష్ట్ర మంత్రులందరూ, కాంగ్రెస్ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తలు మొదలుకొని కీలక నేతలందరూ బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు వెనుకబాటుకు గురైన తెలంగాణ  పునరాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. జనం కోరిన ‘ఇందిరమ్మ రాజ్యం’ దిశగా  కాంగ్రెస్​  ప్రభుత్వం పురోగమిస్తూ  దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాం.

కులగణనతో దేశానికి ఆదర్శం

రాష్ట్రంలో సమగ్ర కుల జనగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలంగాణ. దీంతో జనాభా ప్రాతిపదికన ఆయా సామాజికవర్గాలకు న్యాయం చేసేలా చర్యలు తీసుకునేందుకు భూమికను సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం అత్యున్నత స్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలోనే కాకుండా పలు రాజ్యాంగ, చట్టబద్ద సంస్థల్లో, ఇతర నామినేట్ పోస్టుల్లో బడుగు, బలహీన వర్గాలకు తగు ప్రాధాన్యతనిస్తోంది కాంగ్రెస్ సర్కార్.  పాలనను  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పంథాలో నడుస్తోంది.  ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ప్రజావాణిలో నేరుగా అందుకున్న వినతుల్ని పరిశీలించి, 5 లక్షల ప్రజా సమస్యలను ప్రభుత్వం ఇప్పటికే పరిష్కరించింది. మిగతా వాటిపై ప్రక్రియ కొనసాగుతోంది.  

- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ  అధ్యక్షుడు