అహోబిలం నరసింహస్వామికి..తెలంగాణ ప్రభుత్వ పట్టు వస్త్రాలు

అలంపూర్, వెలుగు : ఏపీలోని అహోబిలం నరసింహస్వామికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు పంపించింది. ప్రస్తుతం అహోబిలం ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్షేత్రాన్ని కాకతీయులు నిర్మించడంతో, అహోబిలం మఠం నిర్వాహకులు పట్టు వస్త్రాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి లెటర్ రాశారు. స్పందించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జోగులాంబ ఆలయం నుంచి పట్టు వస్త్రాలు అందజేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ బుధవారం జోగులాంబ ఆలయ ఈఓ పురందర్ కుమార్, ఆలయ చైర్మన్  చిన్ని కృష్ణయ్య,  ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మతో కలిసి వెళ్లి అహోబిలం నరసింహస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి అహోబిలం ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.