మెరుగైన తెలంగాణ కోసం అడుగులేయండి.!

2023లో ప్రభుత్వ మార్పు, 2024 కొత్త  పాలనకు ఏడాది. మరో కొత్త ఏడాది(2025)వచ్చేసింది. ఇంగ్లీష్​ సంవత్సరాల సంఖ్యలు మారుతూ పోతుంటాయి.  వాటితో పాటు మనమూ పాత అనుభవాల నుంచి పాఠం నేర్చుకుంటూ కొత్త ఏడాదిలో మరింత బాగా బతకాలని కోరుకుంటాం. ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని ఆశిస్తాం. ప్రభుత్వాలూ నిర్మాణాత్మక అభివృద్ధిని, సంక్షేమాన్ని సాధించాలి. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేదే నిజమైన ప్రభుత్వానికి కొలమానం అవుతుంది.  ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలే, ప్రజల తలరాతలుగా మారుతాయి. రాజకీయ నిర్ణయాలతోనే ఏదైనా మార్పు చెందేది. పనికొచ్చే నిర్ణయాలు తీసుకోవడమనేది పాలకుల సమర్థత, నిజాయితీపై  ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్​ సంవత్సరాలు మారినంత మాత్రాన తలరాతలు మారుతాయా అంటే మారవు అనేది ఎంత నిజమో..ఒక స్థిరమైన కాలం నుంచి నేను మారుతాను అని తీసుకునే నిర్ణయంతో తలరాతలు తప్పక మారుతాయి.  ఆ విధంగా ప్రజల తలరాతలు మార్చేందుకు 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన తెలంగాణ కోసంఅడుగులు వేయాలని ఆశించడం ప్రజల హక్కు, అమలు చేయడం పాలకుల బాధ్యత.

సమైక్య పాలన కన్నా కేసీఆర్​ పాలన మరింత అధ్వానంగా సాగడమే కాదు.. సర్వం నేనే అనే ఒంటి స్తంభం మేడ పాలన తెలంగాణ సంక్షేమాన్ని తాయిలాలుగా మార్చేసుకొని రాజ్యమేలింది. అభివృద్ధిని గుదిబండలుగా మార్చేసింది. తెలంగాణ సమాజం తన కాళ్ల మీద తాను నిలబడే విధంగా  కేసీఆర్ పాలన ​ చేసి ఉంటే, ఈ తాయిలాల పథకాలతో పనేముండేది? కేసీఆర్​ తాయిలాలతో పోటీపడి కాంగ్రెస్​  పార్టీ గంపెడు హామీలు ఎందుకు ఇచ్చేది? నగదు పథకాలతో  కేసీఆర్​ అధికారంలో బతికాడు తప్ప, ప్రజలు ఎదగలేదనే నిష్టుర సత్యాన్ని  ఏ ఆర్థిక నిపుణుడూ కాదనలేడు.   

పదేండ్ల అనర్థాలను అధిగమించాలి

2014లో వచ్చిన తెలంగాణకు మొదటి ప్రభుత్వం వేసిన బాటలు సరైనవే అయితే.. ప్రస్తుత ప్రభుత్వం ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేది కాదు. ఈ  విషయం ఏడాది కాలంలో తెలంగాణ ప్రజలకు సైతం బాగా అర్థమైపోయింది. రాజకీయాల్లో గెలవడమే లక్ష్యంగా మారి అడ్డదారిలో  ప్రజలకు తాయిలాల దురాశను కల్పించి అధికారం చేపడితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుంది. ఇది పదేండ్ల తెలంగాణ అనుభవం. రాజకీయాల్లో ప్రత్యర్థిని ఓడించాలంటే, ప్రత్యర్థి కన్నా మరిన్ని ఎక్కువ తాయిలాల ఆశ చూపాలనే యావలో కాంగ్రెస్​పార్టీ  రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకోలేదనే విషయం బహిరంగ రహస్యమే. కాకపోతే, ఒక అనర్థపాలనను గద్దె దించాలన్నపుడు.. ప్రత్యర్థి తాయిలాలతో పోటీ పడక తప్పదు కదా అనేది రాజకీయ పండితుల భాష్యం!

పదేండ్ల అనర్థం

పదేండ్లు 20 లక్షల కోట్లకుపైగా బడ్జెట్​తో కేసీఆర్​ ప్రభుత్వం నడిచింది. ఇంత భారీ మొత్తంతో తెలంగాణ సమాజం ఏమేరకు ఎదిగిందని చూస్తే.. ఆశించిన ఫలితాలు ఎక్కడా కనిపించవు.  కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు, భద్రాద్రి, యాదాద్రి పవర్​ ప్లాంట్లు గుదిబండలుగా మారాయి.  ఈ అభివృద్ధి ప్రాజెక్టులు బతికినంత కాలం వాటిని తెలంగాణ మోయాల్సిందే తప్ప.. వాటి నుంచి సమాజం ఆశించేదేముంది? కేసీఆర్​ సర్కార్​ పదేండ్లలో సంక్షేమ పథకాలకు సుమారుగా 
రూ.6 లక్షల కోట్లు వెచ్చించింది. అంతే సమానంగా సమాజం ఎదిగిందా అనేదే కీలక ప్రశ్న. సమాజ ఎదుగుదలకు ఏ పథకాలు ఉపయోగపడతాయో వాటి అమలు తక్కువ. ఓట్ల పథకాల అమలు ఎక్కువ జరిగింది. పథకాలు ప్రాధాన్యతలను కోల్పోయాయి. అవి చాలామేరకు ఓటు చుట్టూ మాత్రమే తిరిగాయి. తెలంగాణ జనాభాలో కనీసం 3 కోట్ల ప్రజలు పేదలు, మధ్యతరగతి వారే.  వీళ్లు కార్పొరేట్​ విద్యను గానీ, కార్పొరేట్​ వైద్యాన్ని గానీ అందుకో గలిగే  పరిస్థితులలో  లేరు. 

చదువు, ఆరోగ్యం ఆగమైంది

చదువుకు ఫీజురీయింబర్స్​మెంట్​ అందక చదువు మానేసిన పేదల పిల్లలు లక్షల్లోనే ఉండిఉంటారు. వారు పై చదువులు చదివి ఉంటే, ఆ కుటుంబాలు తమంతట తామే ఎదిగేవి కదా!   ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందక పేదలు ఎందరో చనిపోయి ఉంటారు. లేదా అప్పుల పాలై ఉంటారు. లేదా చికిత్సల కోసం ఆస్తులు అమ్ముకొని  పేదరికంలో మగ్గుతూ బతుకుతూ ఉండి ఉంటారు. సంక్షేమ రాజ్యం నిర్వచనాన్నే మార్చేసిన కేసీఆర్​ పాలన తెలంగాణ సమాజాన్ని మరో పదేండ్లు వెనక్కి నడిపించింది.  ఫీజురీయింబర్స్​మెంట్​ ఎగ్గొట్టి, కూతురు పెళ్లికి లక్ష రూపాయాలు (కల్యాణలక్ష్మి) ఇస్తే ఆ కుటుంబం ఎదుగుతుందా? ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు పెట్టి, పొలిటికల్​ మైలేజీ కోసం సీఎంఆర్​ఎఫ్ చెక్​లు ఇస్తే  పేదల ఆరోగ్యాలు బాగుపడతాయా? పదేండ్ల కేసీఆర్​ పాలనలో జరిగిన ఇలాంటి తిరోగమన సంక్షేమంతో తెలంగాణ ఎంత వెనకబడిపోయిందో  ఆలోచిస్తే తెలంగాణ ఏం కోల్పోయిందో అందరికీ అర్థమవుతుంది. 

మద్యంతో ఆగమైతున్న తెలంగాణ

మద్యం  అమ్మకాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర కేసీఆర్​ది. అది తెలంగాణ ప్రజల ఆరోగ్యాలను గుల్ల చేసింది, చేస్తూనే ఉంది. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. ఇది సంక్షేమ రాజ్యానికి అత్యంత ప్రమాదకరం. దేశంలో గుజరాత్, బిహార్​ రాష్ట్రాలు మద్యనిషేధం అమలు చేస్తున్నాయి. నూటికి నూరు శాతం అమలు చేయలేకపోయినా.. అక్కడ కొత్త తరాలకు మాత్రం  మద్యం అలవాటు కాకపోవడమే ఒక గొప్ప విజయంగా చెప్పుకోవాలి. అలాంటి ప్రయత్నం మన తెలంగాణలోనూ ఎందుకు చేయకూడదు? మద్యం అమ్మకాలపై ఆధారపడే ప్రభుత్వాలు తెలంగాణకు 
అవసరమా?

వైద్యం పట్ల చొరవ సరిపోదు

కాంగ్రెస్​ ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం పట్ల చిన్నపాటి అడుగులు వేసిన మాట నిజమే.. కానీ ఆ చిన్నపాటి అడుగులు మాత్రమే సరిపోయేవి కావు.  ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని రూ.5 లక్షల నుంచి పది లక్షలకు పెంచారు. కానీ, కవరేజీ పెంచడంతోనే ఉచిత వైద్యం అమలు చేస్తున్నామంటే సరికాదు. దాని అమలు తీరు, ఆ పథకం అంతటా అందుబాటులో ఉండడమే అత్యంత కీలకం. ప్రమాదకర వ్యాధుల చికిత్సకు లక్షల్లో ఖర్చవుతున్నది. అందుకు పది లక్షల కవరేజీ కూడా ఒకోసారి సరిపోదు. కాబట్టి,  ప్రతి ఏటా ఆరోగ్యశ్రీ కవరేజీని కొంతైనా పెంచుతూ పోవాలి. ఆరోగ్యశ్రీ బకాయిలు భారీగానే ఉన్నాయని వార్తలు చెపుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని  ప్రభుత్వాసుపత్రులకే పరిమితం చేస్తున్నారు. బకాయిలు చెల్లించి, అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ అమలు జరిగేలా చూడాలి.  అప్పుడే ఉచిత వైద్యానికి 
కాస్తయినా సార్థకత దక్కుతుంది. 

విద్యపట్ల దృష్టి  ఇంతేనా?

కేసీఆర్​ ప్రభుత్వం పెట్టిపోయిన ఫీజురీయింబర్స్​మెంట్​ బకాయిలు, ప్రస్తుత ప్రభుత్వంలో ఏర్పడ్డ బకాయలు అలాగే ఉన్నాయని తెలుస్తోంది.  బకాయిలు చెల్లించకుండా పేదలకు, మధ్యతరగతి విద్యార్థులకుఫీజు రీయింబర్స్​మెంట్​ ఎలా అమలు చేస్తున్నదో  రేవంత్​ ప్రభుత్వానికి మాత్రమే తెలుసు! కాకపోతే, నియోజకవర్గానికో  గురుకుల పాఠశాల, స్కిల్​ యూనివర్సిటీ వంటివి తేవడం ఆహ్వానించదగ్గపరిణామమే. అవి మాత్రమే పేదలకు, మద్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్యను అందించలేవు. విద్యకు బడ్జెట్​లో కనీసం 20 శాతం నిధులు కేటాయించి ఉచిత
విద్యను అర్హులందరికీ అందుబాటులోకి తేవాలి.

బుద్ధిజీవుల మాటలను ఆలకించండి

ఏపథకం ఇవ్వకున్నా ఫరవాలేదు. ఉచిత విద్య, వైద్యం ఇస్తూ  మద్యనిషేధం అమలు చేస్తే చాలు.. మెరుగైన తెలంగాణ ఎలా ఏర్పడదో చూస్తాం అని సవాలు చేస్తున్న బుద్ధిజీవుల మాటలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.  రేవంత్​ ప్రభుత్వం ఈ  నూతన సంవత్సరం నుంచి ఆ దిశగా ఆలోచించాలి. రేవంత్​ ప్రభుత్వం పోటీ పడాల్సింది కేసీఆర్​ ఇచ్చిన తాయిలాలతో కాదు.. మెరుగైన తెలంగాణ కోసం పోటీపడి పనిచేయాలి.

తెలంగాణ ఎదురు చూస్తున్నది

పేదలను, మధ్యతరగతిని తాయిలాలతో కట్టిపడేసే రాజకీయాలను పక్కనపెట్టి,  నిజమైన సంక్షేమ రాజ్యం కోసం ఇవాళ తెలంగాణ ఎదురుచూస్తున్నది.  తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడి బతకాలంటే ముందుగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఓ వైపు ఉచిత విద్య,  వైద్యం అందిస్తూ, మద్యనిషేధం విధించాలి. మరో ఐదేండ్లలో మెరుగైన తెలంగాణ ఏర్పడడం అసాధ్యమేమీ కాదు. గత పాలకుడు పదేండ్లలో సంక్షేమాన్ని  భ్రష్టుపట్టించి సమాజాన్ని ఎదగకుండా ఎలా చేశారో.. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్లరాదనేదే మెరుగైన సమాజం కోసం తెలంగాణ కోరుకుంటున్నది. అదేమీ కాకుండా ఓట్ల తాయిలాలతోనే రాజ్యమేలడానికి అలవాటు పడిపోతే, తెలంగాణ సమాజం ఎదుగుదలను ఆశించడం ఎవరి తరం?

పేదలకు చదువే సంపద

తాయిలాల పథకాలకు వెచ్చించే నిధులతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడం సాధ్యమే అని ఆర్థిక నిపుణులు చెపుతున్నారు.పేదలకు, మధ్యతరగతికి చదువే సంపద. చదువే ఆస్తి. వాటిని కల్పించడమే ప్రభుత్వం చేయాల్సిన పని.  పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా ఉన్నత విద్య వరకు అందిస్తే.. వారు తమంతట తామే ఆర్థికంగా, సామాజికంగా ఎదగడం సహజం. దాంతో ప్రభుత్వంపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితుల నుంచి సమాజం  మెల్లమెల్లగానైనా బయటపడుతుంది. అప్పుడు ప్రభుత్వానికే సమాజం సహాయపడే పరిస్థితులు పెరుగుతాయి.  ప్రపంచంలో  సంపన్న దేశాలు ఊరికినే ఏర్పడలేదు. వాటి ఎదుగుదలకు చదువే సంపద అయింది. 

- కల్లూరి శ్రీనివాస్​రెడ్డి
పొలిటికల్​ ఎనలిస్ట్​