రాష్ట్రానికి ఎఫ్‌డీఐల వెల్లువ.. నిరుటి కంటే 33 శాతం వృద్ధి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఈ ఏడాది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రవాహం గణనీయంగా పెరిగింది. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఆరు నెలల్లో రాష్ట్రానికి రూ.12,864 కోట్లు వచ్చాయి. గతేడాది ఇదే సమయంలో రూ.9,679 కోట్లు వచ్చాయి. నిరుడితో పోలిస్తే రూ.3,185 కోట్లు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 33 శాతం ఎఫ్‌డీఐల వృద్ధి నమోదైంది.

కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ ఆరు నెలల పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆరో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, ఢిల్లీ, తమిళనాడు మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రానికి వచ్చిన మొత్తం ఎఫ్‌డీఐలలో దాదాపు 93 శాతం హైదరాబాద్‌లోనే వచ్చాయి. హైదరాబాద్‌కు రూ.11,970 కోట్లు, రంగారెడ్డి జిల్లాకు రూ.680.5 కోట్లు, మహబూబ్‌నగర్‌కు రూ.116.7 కోట్లు, మెదక్‌కు రూ.96.99 కోట్లు వచ్చాయి.