- సెకండ్ తమిళనాడు..మూడో ప్లేస్‌లో తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: పబ్లిక్ హెల్త్ కేర్‌లో కేరళ మళ్లీ సత్తా చాటింది. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్‌లో వరసగా నాలుగోసారి టాప్ ప్లేస్‌లో నిలిచింది. తమిళనాడు కూడా మళ్లీ రెండో స్థానంలో నిలిచింది. కిందటేడు 4వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానానికి చేరింది. ఇంక్రిమెంటల్ ర్యాంకుల్లోనూ రాష్ట్రం మూడో ప్లేస్ దక్కించుకుంది.
పోయినసారి మూడో స్థానంలో ఉన్న ఏపీకి నాలుగో స్థానం దక్కింది. ‘హెల్దీ స్టేట్స్, ప్రోగ్రెసివ్ ఇండియా’ పేరిట నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసిన హెల్త్ ఇండెక్స్ 2019–-20 ఎడిషన్‌లో ఈ వివరాలు వెల్లడించింది. బాలింతలు, శిశు మరణాలు, సెక్స్ రేషియో, దవాఖాన్లలో డాక్టర్లు, నర్సుల సంఖ్య, గర్భిణుల రిజిస్ట్రేషన్లు, డెలివరీలు, హెల్త్ బడ్జెట్, ఇమ్యునైజేషన్, టీబీ రోగుల గుర్తింపు, ట్రీట్‌మెంట్, జనన మరణాల రిజిస్ర్టేషన్ వంటి 30 అంశాల్లో రాష్ట్రాలిచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి నీతా ఆయోగ్ ఏటా హెల్త్ ఇండెక్స్ రూపొందిస్తుంది. సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్రాలకు ఓవరాల్, ఇంక్రిమెంటల్ ర్యాంకులు కేటాయిస్తుంది. ఈసారి ర్యాంకింగ్స్‌లో 82.2 మార్కులతో కేరళ టాప్‌లో నిలిచింది. తర్వాత తమిళనాడు (72.42 మార్కులు), తెలంగాణ (69.96), ఏపీ (69.95), మహారాష్ట్ర (69.14) ఉన్నాయి. యూపీ 2018–19 కంటే 5.52 మార్కులు ఎక్కువగా సాధించి ఈసారి ఇంక్రిమెంటల్ ర్యాంకింగుల్లో టాప్‌లో నిలిచింది. 4.34 మార్కులతో అస్సాం రెండు, 4.22 మార్కులతో తెలంగాణ మూడో ప్లేస్‌లో నిలిచాయి.
ఫ్రంట్ రన్నర్స్‌లో టాప్
హెల్త్ కేర్ సిస్టమ్‌ను బట్టి ఫ్రంట్ రన్నర్, ఆస్పిరంట్, అచీవర్ అని రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించింది. వీటిలో కేరళ, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ ఫ్రంట్ రన్నర్ జాబితాలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లోకెల్లా ఈసారి తెలంగాణ బెస్ట్ పెర్ఫార్మర్‌గా నిలిచిందని రిపోర్టులో పేర్కొంది. ఇమ్యునైజేషన్, టీబీ కేసుల గుర్తింపులో కేరళ, తమిళనాడు కంటే తెలంగాణ మెరుగ్గా ఉంది. శిశువుల మరణాల శాతం (ఎన్‌ఎంఆర్), ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల శాతం (యూఎంఆర్), బాలింతల మరణాల శాతం (ఎంఎంఆర్), జనన సమయంలో సెక్స్ రేషియో (ఎస్‌ఆర్బీ), గర్భిణుల రిజిస్ర్టేషన్ (ఏఎన్‌సీ), డెత్ రిజిస్ర్టేషన్లలో కేరళ, తమిళనాడు కంటే మన రాష్ట్రం కొంత వెనకబడింది.
తెలంగాణలో ఇలా...
- ఆడపిల్లల జననాలు ప్రతి వెయ్యి మంది మగ పిల్లలకు 901కి పెరిగాయి. 2018–19లో ఈ సంఖ్య 897 మాత్రమే
- పుట్టే ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 19 మంది 28 రోజుల్లోపు మరణిస్తున్నారు. 2018–19లో ఇది 20గా ఉండేది
- ప్రతి వెయ్యి మందిలో 30 మంది పిల్లలు ఐదేండ్లు నిండకుండా మరణిస్తున్నారు. 2018–19లో ఈ సంఖ్య 30గా ఉంది
- కాన్పయిన కొద్ది రోజుల్లోనే చనిపోతున్న బాలింతల సంఖ్య లక్షకు 63కు తగ్గింది. 2018–19లో ఇది 76గా ఉండేది.
- రాష్ట్రంలో 96.31 శాతం కాన్పులు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి
- టీబీ బారిన పడిన వారిలో 90.17 % మంది కోలుకుంటున్నారు.
- పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో 19.46 శాతం స్టాఫ్ నర్సుల కొరత ఉంది. ఇక జిల్లా ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత 10.69% ఉంది.
