కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి : ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్

  • సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి 
  • తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి.. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల్లోని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లను రెగ్యులర్​చేయాలని, మినిమం పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. విద్యా పరిరక్షణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి 20 ఏండ్లుగా విద్యారంగానికి సేవలు అందిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. 

అలాగే కాంట్రాక్ట్​టీచర్లను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కేల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రూ.10 లక్షల జీవిత బీమా, రూ.10లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్నారు. రి ఎంగేజ్ విధానాన్ని తీసివేసి, ఉద్యోగంలో ఉండి ప్రమాదవశాత్తు మరణించిన వారికి రూ.20 లక్షల ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కోరారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, దుండిగల్ యాదగిరి, ఝాన్సీ, సౌజన్య పాల్గొన్నారు.