అదీ తెలంగాణ అమ్మాయంటే: అర్జున అవార్డ్‎కు ఎంపికైన దీప్తి జివాంజి

హైదరాబాద్: 2024 సంవత్సరానికి సంబంధించిన క్రీడా అవార్డులను 2025, జనవరి 2వ తేదీన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్‌ రత్న అవార్డుకు నలుగురిని ఎంపిక చేయగా.. మరో 32 మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు సెలెక్ట్ చేసింది. ఐదుగురు కోచ్‎లకు ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ గురువారం (జనవరి 2) జాబితా విడుదల చేసింది. ఈ లిస్ట్‎లో తెలంగాణ అమ్మాయి దీప్తి జువాంజికి స్థానం దక్కింది.

ALSO READ | రైతు కూలీ బిడ్డ ప్రపంచ విజేత

పారా అధ్లెట్ దీప్తి జివాంజి అర్జున అవార్డ్ వరించింది. దీప్తితో పాటు మరో తెలుగు యువతి అర్జున అవార్డుకు ఎంపిక అయ్యింది. ఆంధ్రప్రదేశ్‎లోని విశాఖకు చెందిన అధ్లెట్ జ్యోతి యర్రాజి కూడా అర్జున అవార్డ్‎కు సెలెక్ట్ అయ్యింది. అవార్డ్ విజేతలకు 2025, జనవరి 17న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రధానం చేయనున్నారు. 

ALSO READ | నలుగురికి ఖేల్ రత్న, ఐదుగురికి ద్రోణాచార్య.. 32 మందికి అర్జున అవార్డులు

కాగా, వరంగల్‎ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్ వేదికగా జరుగిన పారాలింపిక్స్‎లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్న విషయం తెలిసిందే. 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్స్‎లో 55.82 సెకన్‌లలో రేస్‏ని కంప్లీట్ చేసి తెలంగాణ యువతి కాంస్య పతకం కొల్లగొట్టింది. తద్వారా పారాలింపిక్స్‎లో ఇంటలెక్చువల్ ఇంపెయిర్మెంట్ విభాగంలో భారత్కు తొలి ఒలంపిక్ మెడల్ సాధించిన అథ్లెట్‍గా దీప్తి  దీప్తి జివాంజి రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి ముందు జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లోను 400ల మీటర్ల రేస్‎ను 55.07 సెకన్లలో పూర్తి చేసి దీప్తి సరికొత్త చరిత్ర సృష్టించింది. 

చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డ దీప్తి.. ఖమ్మం డిస్ట్రిక్ అథ్లెటిక్ మీట్‭లో కోచ్ నాగపూరి రమేష్ కంట్లో పడింది. దీప్తి అద్భుత టాలెంట్‎ను గుర్తించిన కోచ్ రమేష్.. ఆమెను హైదరాబాద్‭కి తీసుకొచ్చారు. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ట్రైయినింగ్ ఇప్పించారు. 

హైదరాబాద్‏లో మెరుగులు దిద్దుకున్న దీప్తి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. పారిస్ పారాలింపిక్స్‎లో మెడల్ గెలవడం ద్వారా దీప్తి పేరు తెలంగాణతో పాటు యావత్ దేశవ్యాప్తంగా మోరు మోగిపోయింది. ఈ నేపథ్యంలోనే విశ్వ క్రీడల్లో పతకం సాధించి దేశ జెండాను ప్రపంచ వేదికలపై రెపరెపలాడించిన దీప్తిని కేంద్రం అర్జున అవార్డుతో సత్కరించింది.