జనవరిలో పంచాయతీ ఎన్నికలు?

 

  • సంక్రాంతి తర్వాతనోటిఫికేషన్ ఇచ్చే చాన్స్
  • మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలా మార్పు?
  • ముగ్గురు పిల్లల రూల్​ఎత్తివేసేందుకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం
  • ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు

హైదరాబాద్, వెలుగు : గ్రామపంచాయతీ ఎన్నికలకు ఇటు  ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే జనవరి రెండో వారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి, సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి, మూడు దశల్లో ఎన్నికలు పూర్తిచేసేలా పక్కా ప్రణాళికలతో ఉన్నారు. ఇప్పటికే కులగణన 95శాతానికి పైగా పూర్తిచేసిన ప్రభుత్వ యంత్రాంగం డాటా ఎంట్రీ చేసే పనిలో బిజీగా ఉంది. వారంలో కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే అవకాశముంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల పదవీకాలం ముగియగా..గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. దాంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. కులగణన తర్వాత లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. దాని ప్రకారం కులగణన ప్రక్రియలో భాగంగా సర్వేను దాదాపు పూర్తి చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ ను నియమించగా.. జిల్లాల్లో పర్యటించి అభిప్రాయాలు సేకరణ చేస్తున్నది. 

మూడు విడతల్లో ఎన్నికలు.. 

రాష్ట్రంలో 32 జిల్లాలు, 538 మండలాల పరిధిలో 12,867 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో మూడు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,67,33, 584 ఓటర్లు ఉండగా.. అందులో పురుషు ఓటర్లు 82,04,518 మంది, మహిళా ఓటర్లు 85,28,573 మంది, ఇతర ఓటర్లు  493 మంది ఉన్నారు. ఒక దశలో నాలుగు వేల పంచాయతీల చొప్పున మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడినా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.

ALSO READ : జీవన్ రెడ్డికే మళ్లీ చాన్స్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్పై పీసీసీ తీర్మానం

పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు

ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో లేని ఈ నిబంధనను పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయడంపై రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.  ప్రజాసేవకు పిల్లల నిబంధన ఎందుకని నాయకులు కొంత కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీనికి ప్రభుత్వంతోపాటు ఎన్నికల కమిషన్ కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. ఎన్నికల నిర్వహణలో భాగంగా మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలా నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలోని దాదాపు 20 మండలాల్లో కనీసం ఐదుగురు  ఎంపీటీసీలు కూడా లేనట్లు సమాచారం. దీంతో ఎన్నికల సంఘం మండలానికి కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండేలా జనాభా ప్రతిపాదికన కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై ప్రభుత్వానికి లేఖ రాయగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఈ రెండు అంశాలపై వచ్చే నెలలో  జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్​చట్టంలో మార్పు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.