తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ

కొల్చారం, వెలుగు: మండల పరిధి చిన్న ఘనపూర్​లో కొత్తగా నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని శనివారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​ రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు.

కేసీఆర్ ఎంతో కష్టపడి తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టారని చెప్పారు. తెలంగాణ రాకముందు మెదక్ జిల్లా ఎట్లుండేదో మనందరికీ తెలుసని,  ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో మన కళ్ల ముందు సాక్ష్యంగా ఉందన్నారు.

సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తా, తెలంగాణ చిహ్నం మారుస్తానని అంటున్నారని, జై తెలంగాణ నినాదాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గౌరీ శంకర్, మాజీ ఎంపీపీ మంజుల, మాజీ జడ్పీటీసీ మేఘమాల, నాయకులు సంతోష్​, రాజాగౌడ్​, రమేశ్, కాశీనాథ్​, ప్రవీణ్​, చెన్నయ్య, మనోహర్​ పాల్గొన్నారు.

 రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్ ప్రభుత్వం

కౌడిపల్లి: రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. మండలంలోని నాగసాన్ పల్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. 20 రోజులు గడుస్తున్నప్పటికీ వడ్లుకొనే నాథుడే లేడని దీనికి తోడు క్వింటాలుకు రెండున్నర కిలోల తరుగుతీస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారని తెలిపారు.హైదరాబాద్​లో కూర్చుని మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా గ్రామీణ రైతుల అవస్థలు చూసి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని రైతుల ఉసురు మీ ప్రభుత్వానికి తగలక 
తప్పదన్నారు.