తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. తెలంగాణలో ఏ బాంబు పేలుతుందో త్వరలో కేటీఆర్ కు తెలుస్తుందని అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి.. జైల్లో యోగా చేసుకుంటా.. తర్వాత వచ్చి పాదయాత్ర చేసుకుంటా’’ అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జైలుకు వెళితే సీఎం అవుతాననే భ్రమలో కేటీఆర్ ఉన్నారని, జైలుకు వెళ్లిన వాళ్లంతా ముఖ్యమంత్రులు కాలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కేసులు పెడితే భయపడేవారు ఎవరూ లేరన్న కేటీఆర్.. ఫార్ములా ఈ రేస్ పై విచారణ అంటే అరెస్టు భయంతో ఢిల్లీకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. కేటీఆర్ ను అరెస్టు చేస్తారో లేదో తెలియదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతందని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు.
55 కోట్ల అవకతవకలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ కార్ రేసింగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు దేశంలోనే తొలిసారి హైదరాబాద్లో గత ప్రభుత్వం ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించింది.
ALSO READ | ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ విచారణకు కేబినెట్ ఆమోదం
అయితే, ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తించింది. దాదాపు రూ.55 కోట్లు దారిమళ్లించినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. బోర్డు, ఆర్థిక శాఖల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ చెల్లించిందన్నది ప్రధాన అభియోగం. ఆ టైమ్ లో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.
ఫార్ములా ఈ రేసింగ్ అవకతవకలపై విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇటీవలే గవర్నర్ ఆమోదం కూడా లభించింది. తాజాగా కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు మంగళ వారం ఏసీబీకి లేఖ రాయాల్సిందిగా సీఎస్ ను ఆదేశించింది.