హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదు.. వరదల వల్ల అమరావతిలో పెట్టుబడులు పెట్టటం లేదు : మంత్రి పొంగులేటి

రియల్ ఎస్టేట్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని మీడియా చిట్ చాట్ లో భాగంగా అన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అమరావతికి పెట్టుబడులు వెళ్తాయనే చర్చలు నడుస్తున్న సందర్భంగా పొంగిలేటి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు రాగానే రియల్ ఎస్టేట్ అమరావతికి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనని కొట్టి పడేశారు. అమరావతి లో వరదల వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. వరదల వల్ల పెట్టుబడులు పెట్టే వారికి భయం పట్టుకుందని, అదే సందర్భంలో హైదరాబాద్, - బెంగుళూరుకు  ఇన్వెస్టర్లు వస్తున్నారని తెలిపారు. హైడ్రా భయం ప్రజల్లో ఏమాత్రం లేదని, మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిందని అన్నారు. 

కేటీఆర్ నిజాలు తెలుసుకోవాలి:

అప్పులపై కేటీఆర్,  BRS నిజాలు తెలుసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు కార్పొరేషన్ లోన్స్ తో కలిపి మొత్తం లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయనేది కేటీఆర్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి 7లక్షల 20వేల కోట్లు  అప్పులు ఉన్నాయని ఈ సందర్భంగా తెలిపారు.


కేసీఆర్తో వ్యక్తిగతంగా మాట్లాడాలని ఉంది:
శాసన సభలో ఎవరి పాత్ర వారిదేనని,  ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కు అని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా కొసరుతో కొట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనతో వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడాలనే కోరిక ఉన్నట్లు తెలిపారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఆదాయం పెరుగుతుందని, అది తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఎలాంటి వ్యతిరేకత లేదని కేవలం ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇలానే ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. కానీ వైఎస్ పాలనలో రెండు మూడు ఏళ్ళల్లో అన్ని సర్దుకున్నాయని, వర్షాలు బాగా పడి వ్యవసాయంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడిచాయని తెలిపారు. ఇక అదాని విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు జరుగుతుందని అన్నారు.