కేదార్​నాథ్​ యాత్రలో మోసపోయిన తెలంగాణ లాయర్లు

  • పవన్​ హాన్స్​ వెబ్​సైట్​లో చీటింగ్​ 
  • ఫేక్​ హెలికాప్టర్ టికెట్లు అంటగట్టిన వైనం 

గద్వాల/అలంపూర్, వెలుగు :  ఉత్తరాఖండ్​లోని కేదార్ నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లిన తెలంగాణ లాయర్లకు ఫేక్ హెలికాప్టర్ టికెట్లు అంటగట్టి మోసం చేశారు. బాధితుల కథనం ప్రకారం..జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​కు  చెందిన అడ్వొకేట్ ​నాగరాజ్ యాదవ్, శాంతినగర్ కు చెందిన శ్రీనివాస్ యాదవ్, మహబూబ్ నగర్ కు చెందిన యోగేశ్వర్ యాదవ్ తో పాటు మరో 15 మంది మూడు రోజుల కింద చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయ దర్శనానికి వెళ్లారు.

బీహార్ ​రాష్ట్రంలోని పాట్నా నుంచి ఆలయానికి వెళ్లేందుకు పవన్ ​హాన్స్​ అనే వెబ్ సైట్ నుంచి హెలికాప్టర్ టికెట్లు కొన్నారు. ఒక్కొక్క టికెట్ కు రూ.5500 నుంచి 8500 వరకు చెల్లించారు. టికెట్లు తీసుకొని బేస్ క్యాంపులోకి వెళ్లి చూపించగా, అక్కడి ఆఫీసర్లు అవి ఫేక్ టికెట్లుగా తేల్చారు.

దీంతో ఫేక్ వెబ్ సైట్ లో టికెట్లు కొని మోసపోయామని గ్రహించారు. తెలంగాణ, ఏపీ ప్రాంతానికి చెందిన దాదాపు 100 నుంచి 150 మంది వరకు ఈ విధంగా టికెట్లు కొని మోసపోయారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వెబ్​సైట్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.