పెద్ద పెద్ద లోయలు, పచ్చని చెట్లు, కొండల మీది నుంచి జాలువారే నీళ్లు.. కనువిందు చేసే ప్రకృతి సొబగులు.. అందుకే అనంతగిరుల అందాలు ‘అనంతం’ అంటుంటారు టూరిస్ట్‌లు. ఎప్పుడూ చల్లని వాతావరణం ఉండడంతో ‘తెలంగాణ ఊటీ’గా కూడా పిలుస్తారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో టూరిస్ట్‌లతో కళకళలాడుతుంటుంది.
అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఉన్నాయి. దట్టమైన అడవి, ఎత్తయిన కొండలు ఉండడం వల్ల టూరిస్ట్‌లు రెగ్యులర్‌గా వెళ్తుంటారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో హైదరాబాద్ నుంచి ఎక్కువమంది వెళ్తారు. ఉస్మాన్ సాగర్, అనంత సాగర్ నీళ్లు ఈ కొండల మీది నుంచే వస్తాయి. మూసీ నది పుట్టినిల్లు కూడా ఈ కొండల్లోనే!
పద్మనాభ స్వామి ఆలయం
అనంతగిరిని తిరుమల శేషాచల కొండలకు తోక భాగంగా చెప్తారు. స్కంద పురాణం ప్రకారం.. ద్వాపర యుగంలో మార్కండేయ రుషి ఇక్కడ పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పుడున్న ఆలయాన్ని మాత్రం నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కట్టించాడు. ఇక్కడికి దగ్గర్లోనే మరో బుగ్గ రామేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం దగ్గర ఉన్న పుష్కరిణి నుంచి 365 రోజులూ నీటి ధార పడుతుంటుంది.
ఆరోగ్యం... అనంతం..
అనంతగిరి అడవుల్లో వీచే గాలికి లక్ష రోగాలను నయం చేసేంత శక్తి ఉందని నమ్ముతారు. అంతేకాదు.. ఈ అడవుల్లో అనేక రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. వాటిని తాకుతూ ప్రవహించే నీళ్లకు కూడా ఔషధ గుణాలున్నాయని నమ్మకం. ఇక్కడి అడవుల్లో జింకలతోపాటు వందల రకాల పక్షులు, రకరకాల జంతువులు, సీతాకోక చిలుకలు ఆకట్టుకుంటాయి.
అడ్వెంచర్ టూరిజం
అనంతగిరి అడ్వెంచర్ టూరిజంకు కేరాఫ్ అయింది. చాలామంది ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి చేస్తారు ఇక్కడ. దేవాలయాలు ఉండడం వల్ల ఆధ్యాత్మిక ప్రాంతంగా కూడా డెవలప్ అవుతోంది. అందుకే ఈ కొండల్లో పర్యాటక శాఖ హరిత వ్యాలీ వ్యూ రిసార్ట్స్ ఏర్పాటు చేసింది. టూరిస్ట్‌ల కోసం కాటేజీలు, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది.
వీకెండ్స్‌లో బిజీ బిజీ..
అనంతగిరి హిల్స్‌కి వెళ్లే టూరిస్ట్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హైదరాబాద్‌కు సుమారు70 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో సెలవు రోజుల్లో అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు నగరవాసులు. శని, ఆదివారాల్లో అయితే దాదాపు ఐదు నుంచి 10 వేల మంది వరకు వెళ్తారని ఒక అంచనా.