సర్కార్‌‌‌‌ భూముల్ని గుర్తించండి: హైకోర్టు

 

  • రంగారెడ్డి కలెక్టర్‌‌‌‌కు హైకోర్టు ఆదేశం
  • తుర్కయంజాల్ భూములపై విచారణ

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌‌‌మెట్‌‌‌‌ మండలం తొర్రూరు ప్రస్తుత తుర్కయంజాల్‌‌‌‌ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ 383లో ఉన్న 259 ఎకరాల్లో.. ప్రభుత్వ భూమిని గుర్తించాలని ఆ జిల్లా కలెక్టర్‌‌‌‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. అదేవిధంగా, ప్రైవేటు భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పింది. 

ప్రభుత్వ భూములుగా గుర్తించిన వాటిని చట్టప్రకారం నిషేధిత జాబితాలో చేర్చాలని, మరిన్ని కేసులకు అవకాశం ఇవ్వకుండా చూడాలని సూచించింది. తొర్రూరులో సర్వే నంబర్ 383/2లో భర్త కానుకగా ఇచ్చిన ప్లాట్‌‌‌‌ నంబర్ 13ను రిజిస్ట్రేషన్ చేసేందుకు వనస్థలిపురం సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ నిరాకరించారు. దీన్ని సవాల్ చేస్తూ శైలజ అనే మహిళ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌‌‌‌ ఎన్వీ శ్రవణ్​కుమార్ విచారణ చేపట్టారు.

 కోర్టుకు హాజరైన సబ్‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌.. రిజిస్ట్రేషన్ నిరాకరించడానికి గల కారణం చెప్పలేకపోయారు. ఇక్కడ కొన్ని భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్‌‌‌‌ 2017లో కలెక్టర్‌‌‌‌కు లేఖ రాశారని, ఇప్పటి దాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 4న కలెక్టర్‌‌‌‌ హైకోర్టుకు హాజరయ్యారు. 

సర్వే నంబర్ 383లో 259 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో ఎలాంటి సబ్‌‌‌‌ డివిజన్‌‌‌‌ సర్వే నంబర్లు లేవని తెలిపారు. ఏడు ఎకరాలకు పైగా భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారని చెప్పారు. ప్రభుత్వ భూమి గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైందని, రెండు నెలల్లో పూర్తవుతుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి.. 2 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు భూములను గుర్తించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

పిటిషనర్‌‌‌‌ రిజిస్ట్రేషన్‌‌‌‌కు సంబంధించి చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సబ్‌‌‌‌రిజిస్ట్రార్‌‌‌‌ను ఆదేశిస్తూ పిటిషన్‌‌‌‌పై విచారణను ముగించారు.