పట్నం నరేందర్ రెడ్డికి ముందస్తు బెయిల్

హైదరాబాద్, వెలుగు: లగచర్లలో అధికారులపై దాడికి సంబంధించి బొమ్రాసుపేట పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఫార్మసిటీ భూసేకరణకు వెళుతున్న అధికారులను అడ్డగించి దాడి చేశారంటూ కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ ఫిర్యాదులో తన పేరు లేకపోయినప్పటికీ భవిష్యత్తులో పోలీసులు చేర్చి అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అందువల్ల ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ నరేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 

దీనిని సోమవారం విచారించిన జస్టిస్ కె. లక్ష్మణ్ షరతులతో ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల చొప్పున వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలి.  ప్రతి సోమవారం పోలీసు స్టేషన్ లో హాజరు కావాలి. విచారణకు సహకరించాలి. సాక్షులను ప్రభావితం చేయరాదు.. అని షరతులను విధించారు. పిటిషన్లపై విచారణను మూసివేశారు.