పంట బీమా ఏది? ప్రీమియం చెల్లింపుపై ఇప్పటికీ విధివిధానాలు ఖరారు కాలే

హైదరాబాద్, వెలుగు: వానాకాలం అయిపోయింది. యాసంగి వచ్చింది. అయినా ఇప్పటి వరకు పంట బీమాపై సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో పంట బీమా పథకంపై విధివిధానాలు ఖరారు కాలేదు. దీంతో వ్యవసాయ శాఖ ఇప్పటి వరకు టెండర్లు ఖరారు చేయలేదు.

టెండర్లు ఖరారు చేస్తే యాసంగిలో నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండవని, పంటలు కోసే సమయంలో అకాల వర్షాలతో నష్టం జరిగితే.. పంట బీమా ద్వారా ఆదుకునే అవకాశం ఉంటుందని రైతుల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే ఒక సీజన్​ ముగిసిపోగా మరో సీజన్​ ప్రారంభమైంది. కానీ.. ఇంతవరకు కార్యాచరణ షురూ కాకపోవడం విమర్శలకు తావిస్తోంది.

పంట బీమాపై మార్గదర్శకాలు రూపొందించి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్న డిమాండ్​ వ్యక్తమవుతోంది. కాగా.. 2018 తర్వాత పంట బీమా పథకం ఆగిపోయింది. ఈ పథకం బదులుగా కొత్తగా పథకం తీసుకువస్తామని అప్పటి బీఆర్ఎస్ సర్కారు చెప్పింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక పంటబీమాను అమలు చేయలేదు, కొత్త పథకాన్నీ తీసుకురాలేదు. ఫలితంగా భారీ వానలు, వరదల కారణంగా వేల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు బీమా సాయం అందలేదు. దీంతో వారు రూ.వేల కోట్లు నష్టపోయారు. కొత్త సర్కారు కూడా ఇన్నాళ్లు పంట బీమాపై జాప్యం చేయడం తగదని రైతులు అంటున్నరు.

సీజన్ను బట్టి ప్రీమియం, క్లెయిమ్లు
రాష్ట్రవ్యాప్తంగా సీజన్​ను బట్టి పంట సాగు ఉంటుంది. వానాకాలంలో కోటిన్నర ఎకరాల వరకు పంటలు సాగవుతుండగా యాసంగిలో సగం పంటలే  సాగవుతాయి. వానాకాలం సీజన్​లో పంట చేతికి వచ్చే టైమ్ లో వర్షాలు ఎక్కువగా కురిసి పంట నష్టం జరుగుతుంది. కానీ.. యాసంగిలో వర్షాలు లేక పంటలకు సరిగా నీరు అందక ఎండిపోయి నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను బట్టి పంట బీమా పరిహారం అందేలా బీమా కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఏఐతో  క్రాప్ డ్యామేజీని ఎస్టిమేట్​ చేయాలి
పంటల బీమా పథకంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని వినియోగించాలని నిపుణులు అంటున్నరు. ఏఐ పరిజ్ఞానంతో అత్యంత కచ్చితత్వంతో పంటనష్టాన్ని అంచనా వేయొచ్చని వారు చెబుతున్నారు.

రైతు యూనిట్గా పంట బీమా ఉండాలి
జీవిత బీమాలో వ్యక్తులకు ఏదైనా ప్రమాదం జరిగితే పరిహారం ఎలా వస్తుందో... అలాగే ఒక రైతుకు చెందిన పంట ఎంత నష్టం జరిగినా పరిహారం అందేలా నిర్ణయాలు ఉండాలనే డిమాండ్​ వ్యక్తమవుతోంది. గతంలో ఫసల్​ బీమా అమలు చేసినప్పుడు గ్రామం లేదా మండలం యూనిట్​గా అందులో కొన్ని రకాల పంటలకు మాత్రమే పంట బీమా అమలయ్యేది.

అంతేకాకుండా ఆయా యూనిట్ లో ఉన్న పంటల్లో 33 శాతం దెబ్బతింటేనే పంట బీమా వర్తించేంది. అంటే ఒక రైతుకు పదెకరాల్లో పంట వేస్తే అందులో 3 ఎకరాలకు పైగా దెబ్బతింటేనే ఫసల్​ బీమా పరిహారం అందేది. అయితే, గ్రామంలో ఒక రైతుకు చెందిన ఒక ఎకరం అర ఎకరంలో పంట దెబ్బతిన్నా  ఆ రైతుకు పరిహారం ఇచ్చేలా ప్రభుత్వం బీమా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని రైతులు కోరుతున్నరు.