రైతులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా అమలు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు వద్దన్నారాయన. రైతు భరోసా అంశంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఈ మేరకు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో ప్రేమ ఉందన్నారు. భూమి చుట్టూనే రైతు జీవితం, వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. భూమినే నమ్ముకుని.. భూమినే అమ్మగా భావించి జీవనాధారం సాగిస్తున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడి సాయం కింద రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతోనే రైతు భరోసా తెస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం.. బీఆర్ఎస్ పార్టీ హయాంలో... సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్లు, రప్పలు, జాతీయ రహదారుల కింద పోయిన భూములు.. పరిశ్రమల్లోని భూములు ఇలాంటి వాటన్నింటికీ రైతు బంధు కింద.. అనర్హులకు కూడా డబ్బులు ఇచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో 72 వేల కోట్లు రైతు బంధు కింద చెల్లిస్తే.. అందులో 22 వేల 606 కోట్ల రూపాయలు అనర్హులకే చెల్లించారన్నారు. ఈ 22 వేల 606 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ నేతలు దోచుకున్నారన్నారు.
ఇలాంటి తప్పిదాలు అన్నింటినీ సవరించి.. కొత్త విధానాలు రూపొందించి.. అర్హులకే రైతు బంధు సాయం అందించే విధంగా ప్రణాళిక రచిస్తున్నామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత.. 2025 జనవరి నెలలో కొత్త విధివిధానాలతో రైతు బంధు నిధులు విడుదల చేస్తామన్నారు. నిజమైన రైతులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. హైదరాబాద్ లో అసలు వ్యవసాయమే లేదని.. ఇలాంటి హైదరాబాద్ సిటీలోనూ రైతు బంధు కింద డబ్బులు దోచుకుని తిన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.