ఉన్నత విద్యలో సమూల మార్పులు తెస్తున్నాం...ప్రతి మూడేండ్లకోసారి సిలబస్ సవరణకు ప్లాన్

దోస్త్ తొలగింపుపై ఎలాంటి నిర్ణయం చేయలేదు
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్టారెడ్డి

నాగర్ కర్నూల్, వెలుగు : రాష్ట్రంలో గడిచిన పదేండ్లలో ఉన్నత విద్యను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారని,  ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చొరవతో సమూల మార్పులు తెస్తున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకృష్ణ రెడ్డి తెలిపారు.  విద్యా, ఉద్యోగావకాశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు ఈనెల 7న నోవాటెల్ హోటల్ లో 100 పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆదివారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఉన్నత విద్యకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు. ప్రతి మూడేండ్లకోసారి సిలబస్‌‌ను సవరిస్తూ, ప్రపంచీకరణకు అనుగుణంగా తయారు చేసేలా ప్లాన్ రూపొందించినట్లు పేర్కొన్నారు. తద్వారా విద్యార్థులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. రెగ్యులేటరీ బాడీల నివేదికల ఆధారంగా సిలబస్ మార్పులు అమలు చేస్తామన్నారు. జూన్ – -జూలై అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ముందే మార్గదర్శకాలను పూర్తి చేసి, వర్సిటీల్లో అమలు చేస్తామన్నారు.  డిగ్రీ అడ్మిషన్లలో ‘ దోస్త్’ వ్యవస్థను తొల గిస్తారనే వార్తలపై స్పందిస్తూ, అలాంటి నిర్ణయం తీసుకోలేదని, చర్చ కూడా జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

కొత్త జిల్లాల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తక్కువ డిమాండ్ ఉన్న డిగ్రీ కోర్సులను తొలగించి, ఉద్యోగావకాశాలు కల్పించేలా కొత్తవి ప్రవేశపెట్టి.. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందించేందుకు కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయిలో అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.