- బీటీ, సీసీ రోడ్లకు రూ.45.32 కోట్లు
- ఎఫ్డీఆర్ కింద రూ.7.44 కోట్లు
- సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన
మెదక్, పాపన్నపేట, వెలుగు: గిరిజన తండాల రోడ్లకు మహర్దశ రానుంది. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు కావడంతో పాటు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగడంతో రోడ్ల నిర్మాణం స్పీడ్‌గా జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెదక్, హవేలి ఘనపూర్, పాపన్నపేట, రామాయంపేట, నిజాంపేట మండలాల్లో దాదాపు 60 గిరిజన తండాలు ఉంటాయి. చాలా తండాలు గ్రామాలకు దూరంగా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి.
ALSO READ : మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో నేరాలు పెరిగినయ్ .. వనపర్తిని వణికిస్తున్న వరుస చోరీలు
సరైన రోడ్డు సౌకర్యాలు లేక ఎక్కడికి వెళ్లాలన్నా ఆయా తండాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం పరిస్థితి మరి ఇబ్బందికరంగా మారుతోంది. కొద్దిపాటి వర్షాలకే రోడ్లు మొత్తం బురదమయమై వాహనాలు కాదుకదా కనీసం కాలినడకన కూడా వెళ్లడానికి వీలులేకుండా తయారవుతున్నాయి. దీంతో అత్యవసర సమయాల్లో ఆస్పత్రులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. హవేలి ఘనపూర్ మండలం కొచ్చెరువు తండా, శుక్లాల్పేట తండా, లింగసాన్‌పల్లి తండాకు, పాపన్నపేట మండలం రాజ్య తండా, సీత్య తండా, అమూర్య తండా రోడ్లు బాగాలేవు. పలు గిరిజన తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైనప్పటికీ రోడ్డు సౌకర్యం లేకపోవడం లోటుగా ఉంది.
రూ.52.76 కోట్ల పనులకు..
తండాలకు బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరైన రూ.45.32 కోట్లు, ఎఫ్డీఆర్ కింద మంజూరైన రూ.7.44 కోట్లు కలిపి మొత్తం రూ.52.76 కోట్ల విలువైన పనులకు ఈ నెల 25న మెదక్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఏడుపాయల్లో శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయా పనులకు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టేందుకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఎమ్మెల్యే చొరవతో..
తండాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతుండడాన్ని గుర్తించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బీటీ, సీసీ రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి రూ.45.32 కోట్లు మంజూరు చేసింది. గడిచిన వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల్లో పలు రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఎఫ్డీఆర్కింద రూ.7.44 కోట్లు మంజూరు చేసింది.