యాదాద్రి జిల్లాలో రూ.35 కోట్ల చేనేత రుణాలు .. లోన్స్​పై ప్రభుత్వానికి రిపోర్టు పంపిన డిపార్ట్​మెంట్​

  • జిల్లాలో వ్యక్తిగత రుణాలు రూ. 30 కోట్లు
  • సొసైటీల రుణాలు రూ. 5.25 కోట్లు

యాదాద్రి, వెలుగు : చేనేత కార్మికులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగంలోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలున్నాయి. ఆ రంగంలో పని చేస్తున్న కార్మికులను ఆదుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో చేనేత కార్మికుల రుణాల మాఫీ అంశంపై సీఎం రేవంత్​ రెడ్డి గతంలోనే ప్రకటన చేశారు. ఇందులో భాగంగా రుణాలకు సంబంధించిన వివరాలను హ్యాండ్లూమ్ డిపార్ట్​మెంట్ నుంచి సేకరిస్తోంది. చేనేత కార్మికులు వ్యక్తిగత రుణాలు, సొసైటీల రుణాల వివరాలను వేర్వేరుగా డిపార్ట్​మెంట్​సర్కారుకు పంపిస్తోంది. 

యాదాద్రిలో 43 సొసైటీలు..

చేనేత రంగంలో యాదాద్రి జిల్లాది చెరగని ముద్ర. పోచంపల్లి పట్టు చీరలకు పెట్టింది పేరు. ఈ చేనేత రంగంలో అనేక మంది ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో 43 చేనేత సొసైటీలు ఉన్నాయి. వీటిలో వేలాది మంది కార్మికులు మెంబర్లుగా ఉన్నారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2010 నుంచి 2017 మార్చి 31 వరకు చేనేత కార్మికులు తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చేనేత సొసైటీలు, కార్మికులు మళ్లీ రుణాలు తీసుకున్నారు. 

రుణమాఫీపై సీఎం ప్రకటన..

రైతు రుణమాఫీ అమలు చేస్తున్న తరుణంలోనే చేనేత రుణమాఫీపై సీఎం రేవంత్​ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చేనేత రుణాలు మాఫీ చేస్తామని గత సెప్టెంబర్​లో ఆయన ప్రకటించారు. దీంతో చేనేత వర్గాలు ఆనందంలో మునిగిపోయాయి. ఇటీవల చేనేత కార్మికులు, సొసైటీలు తీసుకున్న రుణాల వివరాలను పంపించాలని చేనేత శాఖ జిల్లా ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. 

రుణాలు చెల్లించిన 829 మంది..

రుణాలు తీసుకున్న వారిలో 829 మంది కార్మికులు తిరిగి చెల్లించినట్టు ఆఫీసర్లు రిపోర్టులో పేర్కొన్నారు. చెల్లించిన మొత్తం పోనూ రూ.18.05 కోట్లు వ్యక్తిగత రుణాలు, సొసైటీలకు సంబంధించిన రూ.5.25 కోట్లు పెండింగ్ ఉంటుందని అధికారులు లెక్కలు వేశారు. అయితే చెల్లించినవారి రుణాలు కూడా మాఫీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. ఏదీ ఏమైనా రుణమాఫీపై త్వరలోనే ప్రభుత్వం నుంచి తీపికబురు వస్తుందని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు.

యాదాద్రిలో రూ.35.25 కోట్లు..

హయ్యర్ ఆఫీసర్ల ఆదేశాలతో జిల్లా ఆఫీసర్లు రుణాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. దీంతోపాటు తీసుకున్న రుణాలు చెల్లించిన వారి వివరాలను కూడా సేకరించారు. డిపార్ట్​మెంట్​లెక్కల ప్రకారం 2017 ఏప్రిల్​నుంచి 2024 మార్చి వరకు యాదాద్రి జిల్లాలోని చేనేత కార్మికులు, సొసైటీలు రూ.35.25 కోట్లు రుణాలు తీసుకున్నారు. జిల్లాలోని 43 సొసైటీల్లో 11 సొసైటీలు రూ.5.25 కోట్లు రుణాలు తీసుకున్నాయి. 1162 మంది కార్మికులు వ్యక్తిగతంగా రూ.లక్షలోపు రూ.6 కోట్లు తీసుకున్నారు. రూ.లక్షకు పైగా 1537 మంది కార్మికులు రూ.24 కోట్ల రుణాలు తీసుకున్నారు. 2,689 మంది కార్మికులు కలిసి మొత్తంగా రూ.30 కోట్లు రుణాలు తీసుకున్నారని జిల్లా ఆఫీసర్లు రిపోర్ట్ పంపించారు.