విద్యను గాడిన పెడుతున్న తెలంగాణ సర్కార్​

దేశ భవిత బాలల విద్యపైనే ఆధారపడి ఉంటుందని భారత మొదటి ప్రధానమంత్రి జవహర్‌‌లాల్ నెహ్రూ ఎంతో స్పష్టంగా చెప్పారు.  బాలల మెరుగైన భవిష్యత్తు పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపేవారు. బాలల విద్యపై  ప్రభుత్వాలు తగిన శ్రద్ధ పెట్టాలి. వారు దేశ భవిష్యత్తుకు బలమైన పునాదిగా గుర్తించాలి.. నేటి పోటీ ప్రపంచంలో అభివృద్ధికి బలమైన పునాదిని వేయాలంటే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి.  దేశంలో శక్తిమంతమైన యువత లభించాలంటే విద్యావకాశాలను పెంచడం అత్యంత కీలకం.  శాస్త్ర సాంకేతికత విద్యకు  ప్రభుత్వాలు పెద్దపీట వేయాలి. ఈక్రమంలో  తెలంగాణ రాష్ట్రం కూడా బాలల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో అధిక శ్రద్ధ చూపుతోంది. సకాలంలో ప్రవేశాలు, విద్యాభ్యాసంలో  విద్యార్థులు పాల్గొనడం, విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం వంటి అంశాలు తెలంగాణలో ప్రాధాన్యత పొందాయి.

పెరిగిన విద్యార్థుల హాజరుశాతం

2023-–24 సంవత్సరానికిగాను తెలంగాణలో విద్యార్థుల హాజరు రేటు 85%  ఉంది. ఇది గతంతో  పోలిస్తే 10% వృద్ధిని చూపిస్తోంది. తండాలు, గిరిజన ప్రాంతాలలో బాలల విద్యను ప్రోత్సహించడానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా పాఠశాలలను వీడుతున్న పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ఇది విద్యావ్యవస్థకు మంచి పరిణామం.   తెలంగాణలో  కాంగ్రెస్​ సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో  గిరిజన ప్రాంతాల్లో విద్యా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడం హర్షణీయం.  తాగునీటి వసతి,  మౌలిక వసతులు కల్పించడం. గ్రామీణ ప్రాంతాల్లో బాలల విద్యను ప్రోత్సహించడానికి,  హాజరు శాతాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. 

విద్యారంగం పటిష్టం చేయడానికి తీసుకుంటున్న చర్యలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతున్నాయి.  2023–-24 బడ్జెట్‌‌లో తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి 30,000 కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా బాలల విద్యకు మరింత పునాది బలపరిచే ప్రయత్నం చేస్తున్నది.   బాలల విద్యాభివృద్ధిలో ప్రభుత్వం శ్రద్ధ  క్రమేపీ పెరుగుతోంది. బాలల విద్యాభ్యాసంలో  తెలంగాణ 93% విద్యార్థులు ఆడపిల్లలు ఉండటం గమనార్హం,. ఇది బాలికల విద్యకు పెరుగుతున్న ఆదరణను సూచిస్తోంది.  నాబార్డ్ నివేదిక ప్రకారం తెలంగాణలో విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం  20% పెరిగింది.

 కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు   

బాలల విద్యారంగ అభివృద్ధికి  రేవంత్​ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి  గణనీయమైనదిగా ఉంది. అయితే, ఇంకా  మెరుగైన, సత్ఫలితాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. 2023-–24 సంవత్సరానికిగాను తెలంగాణలో విద్యార్థుల హాజరు రేటు సుమారు 85% వరకు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు  తెలియజేస్తున్నాయి.  ఇది గత సంవత్సరాలతో పోలిస్తే మెరుగైన స్థితికి చేరుకున్నది.  ప్రభుత్వం విద్యార్థుల హాజరు రేటు పెంచడానికి,  పాఠశాలల్లో  విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టింది, వాటిలో బడి బాట, మీల్ పథకం,  డిజిటల్ క్లాసులు వంటి పథకాలు ముఖ్యమైనవి.  గ్రామీణ ప్రాంతాలలో  ఈ ప్రగతి ప్రశంసనీయంగా ఉంది.   

ఆర్థికంగా  వెనుకబడిన విద్యార్థులు హాజరు గణనీయంగా పెరుగుతున్నది. తెలంగాణా రాష్ట్రంలో ఎంవీఎఫ్​ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల మెరుగైన విద్య కోసం చేస్తున్న కృషి నిజంగా ప్రశంసనీయమైనది. ఈ సంస్థలు  బాలల హక్కులను రక్షించేందుకు నిరంతరం శ్రమిస్తూ, విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. చిన్నారులు తమ స్వప్నాలను నెరవేర్చుకోవడానికి విద్య అనేది కీలకమైన అంశం. కాబట్టి, ఇలాంటి సంస్థలు పిల్లలకు ఉచిత విద్య, భద్రత, సరైన మార్గనిర్దేశం లభించేలా కృషి చేస్తున్నాయి.  పిల్లల హక్కుల పరిరక్షణ,  బాల కార్మిక వ్యవస్థను నియంత్రించేలా గ్రామస్థాయిలో చైతన్యం తీసుకురావడం, తల్లిదండ్రులకుఅవగాహన కల్పించడం అభినందనీయం. 

 

- డా. చిట్యాల రవీందర్