- సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఫైల్
- త్వరలో జీవో వెలువడే చాన్స్
మహబూబ్‌నగర్, వెలుగు: కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పాత ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తుండగా.. ఇందులో గ్రేడ్–1 కేటగిరిలో ఉన్న మహబూబ్‌నగర్ మున్సిపాల్టీకి అవకాశం దక్కే చాన్స్ ఎక్కువగా ఉంది. దీనికితోడు కొద్ది రోజుల కింద మహబూబ్‌నగర్ మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్ అందాయి. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి కూడా సముఖత వ్యక్తం చేయడంతో ఒకటి, రెండు నెలల్లో జీవో విడుదలయ్యే చాన్స్ ఉంది.
సౌలతులు పెరుగుతయ్..
పాలమూరు కార్పొరేషన్‌గా ఏర్పాటు కానుండడంతో డెవలప్మెంట్ మరింత స్పీడప్ కానుంది. ప్రతి కాలనీకి రోడ్ల సౌకర్యం, తాగునీరు, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర వసతులు మెరుగుపడతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం అందుబాటులోకి రానుంది. ట్యాక్స్‌లు కూడా పెరగనున్నాయి. తద్వారా ఆదాయం సమకూరడంతో పాటు డెవలప్మెంట్కు ఆస్కారం ఏర్పడుతుంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెవలప్మెంట్ కోసం కార్పస్ ఫండ్స్ కూడా రానున్నాయి.
గత ప్రభుత్వంలో పేపర్లకే పరిమితం..
2009లో పాలమూరు ఎంపీగా ఉన్న కేసీఆర్.. ఈ మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేసే ప్రయత్నం చేయలేదు. 2014 నుంచి 2023 వరకు ఆయన సీఎంగా పని చేసినా.. దీని గురించి పట్టించుకోలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఓట్ల మైలేజీ కోసం ఆ పార్టీకి చెందిన అప్పటి మహబూబ్‌నగర్ ప్రాంత లీడర్లు పాలమూరును కార్పొరేషన్‌గా చేస్తున్నామని, ప్రపోజల్స్ కూడా పంపాపని మీడియా సమావేశాలు పెట్టి ప్రకటనలు చేశారు. కానీ, అది ఎలక్షన్ స్టంట్‌గానే మిగిలిపోయింది.
మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలను కలుపుతూ కార్పొరేషన్ చేయాలని ఆ లీడర్ భావించగా.. దేవరకద్ర, జడ్చర్లకు చెందిన లీడర్లు దీన్ని వ్యతిరేకించారు. మూడు మున్సిపాల్టీలను కలుపుతూ కార్పొరేషన్ చేస్తే.. మేయర్‌గా మహబూబ్‌నగర్ ప్రాంత లీడర్‌కు అవకాశం వస్తుందని, దీంతో సదరు లీడర్ కనుసన్నల్లోనే మేయర్ పని చేస్తాడని హైకమాండ్‌కు వివరించినట్లు సమాచారం. మేయర్కంటే ఎమ్మెల్యే ప్రొటోకాల్ తక్కువ కావడంతో ఇబ్బందులు వస్తాయని.. జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలను కలిపి కార్పొరేషన్ చేయడాన్ని విరమించుకోవాలని కోరారు. దీంతో ఈ అంశం మరుగున పడింది.
ఉద్యోగుల కేటాయింపు కీలకం
గత ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసింది. పాలకవర్గాలనూ నియమించింది. కానీ, స్ట్రెంత్‌కు తగ్గ ఉద్యోగులను నియమించలేదు. దీంతో అథారిటీలు అస్తవ్యస్తంగా మారాయి. పాలకమండళ్లు నామమాత్రమయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతుండగా.. ఉద్యోగుల నియామకం టాస్క్‌గా మారనుంది. ప్రతి కార్పొరేషన్‌కు కమిషనర్‌గా ఐఏఎస్ ఆఫీసర్ వ్యవవహరించనుండగా.. జనరల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ ఇన్స్పెక్టర్లు, ఎడ్యుకేషన్, రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులను అలాట్ చేయాల్సి
ఉంటుంది.
మరింత డెవలప్ అవుతుంది..
పాలమూరు మున్సిపాల్టీ త్వరలో కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ కాబోతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రపోజల్స్ కూడా పంపాం. సీఎం కూడా సముఖత వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అయితే కేంద్ర నుంచి పెద్ద మొత్తంలో ఫండ్స్ వస్తాయి. పాలమూరును మరింత డెవలప్ చేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మహబూబ్‌నగర్
ఏ మున్సిపాల్టీలు కలవకుండానే..
మహబూబ్‌నగర్ మున్సిపాల్టీలో ప్రస్తుతం 3.40 లక్షల జానాభా ఉంది. కార్పొరేషన్ కావడానికి లక్ష జనాభా అవసరం. అందుకే పాలమూరులో జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలను కలపకుండానే కార్పొరేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
ఆనంద్ గౌడ్, మున్సిపల్ చైర్మన్, మహబూబ్‌నగర్