ఇరిగేషన్​లో ప్రమోషన్లకు కమిటీ!

  • 15 రోజుల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం
  • న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు  
  • ఈ నెలాఖరులోపు ట్రాన్స్​ఫర్లు కూడా చేపట్టాలని డెసిషన్ 

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​శాఖలో ప్రమోషన్లపై సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. 15 రోజుల్లో ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఫైవ్​మెన్​ కమిటీని నియమించినట్టు తెలిసింది. ఇందులో ఇరిగేషన్​ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్​దాస్​, ఆ శాఖ కార్యదర్శి రాహుల్​బొజ్జా, స్పెషల్​సెక్రటరీ ప్రశాంత్​జీవన్​పాటిల్, ఈఎన్సీలు అనిల్​కుమార్, విజయ్​భాస్కర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం.

ఏఈఈల స్థాయి నుంచి సీఈ, ఈఎన్సీల స్థాయి వరకు అన్ని రకాల ప్రమోషన్లకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసి.. ప్రమోషన్లను పూర్తి చేసే బాధ్యతను ఈ కమిటీకి ప్రభుత్వం అప్పగించినట్టు తెలిసింది. గత సర్కార్ హయాంలో దాదాపు పదేండ్ల పాటు అధికారులకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో చాలామంది అధికారులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రమోషన్ల లిస్టులో ఉన్న అధికారులు ప్రస్తుతం రిటైర్మెంట్​కు దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్లు ఇస్తే అలాంటి అధికారులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో సర్కార్ ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.  

ఇక అదనపు బాధ్యతలు ఉండవ్.. 

గత సర్కార్ ప్రమోషన్లు ఇవ్వకుండా, కొత్త నియామకాలు చేపట్టకుండా ఉన్న అధికారులతోనే అడ్జస్ట్​చేసింది. ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఒకచోట పనిచేస్తున్న అధికారికి.. మరో చోట దూరంగా ఖాళీ ఉన్న ప్రాంతానికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈఈలకు ఎస్​ఈలుగా, ఎస్​ఈలకు ఇన్​చార్జ్ సీఈలుగా బాధ్యతలు ఇచ్చింది.

అయితే, దాని వల్ల అధికారులపై పనిభారం పెరగడంతో పాటు ఉన్న పనులను పూర్తి చేయడంలోనూ సమస్యలు ఎదురయ్యాయి. చాలా వరకు పనులు పెండింగ్​లో పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇకపై ఎవరికీ అదనపు బాధ్యతలను ఇవ్వొద్దని సర్కార్ నిర్ణయించింది. ప్రమోషన్లను ఇవ్వడంతో పాటు శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

సిబ్బంది నియామకాల విషయంలో ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. మరోవైపు అధికారులెవరూ వారికి కేటాయించిన హెడ్​క్వార్టర్స్​ దాటి రాకుండా కఠినమైన రూల్స్​పెడుతున్నట్టు తెలిసింది. హెడ్​క్వార్టర్స్​ను దాటి చాలా మంది అధికారులు హైదరాబాద్​లోనే మకాం వేస్తుండడంతో మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హెడ్​క్వార్టర్స్​లో ఉండని అధికారులకు ఇకపై మెమోలు జారీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఎవరికీ అన్యాయం జరగకుండా.. 

ప్రస్తుతం ప్రమోషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్​లో ఉంది. జోన్​ 6, జోన్​ 5 అధికారులకు సంబంధించి ప్రమోషన్ల అంశంపై చర్చ నడుస్తున్నది. జోన్​ 5 అధికారులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, తమకు అన్యాయం జరుగుతున్నదని జోన్​ 6 అధికారులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే కోర్టులో కేసు పెండింగ్ పడింది. ఇటు బీటెక్​ పూర్తి చేసి ఏఈఈలుగా ఎంపికైన అభ్యర్థులు, డిప్లొమా ద్వారా ఏఈలుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు సంబంధించిన పంచాయితీ కూడా నడుస్తున్నది.

ఈ క్రమంలోనే కోర్టు కేసు ఆధారంగా ఎవరికీ అన్యాయం జరగకుండా.. మరోసారి న్యాయ సమస్యలు తలెత్తకుండా ప్రమోషన్లను చేపట్టే అంశంపై ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. దానిపైనా స్టడీ చేయాలని ఫైవ్​మెన్​కమిటీకి ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది. పదేండ్లుగా ఒకే చోట ఉన్న అధికారులను ట్రాన్స్​ఫర్​చేయాలనీ సర్కార్ నిర్ణయించినట్టు సమాచారం.