ఉన్న పట్టణాభివృద్ధి సంస్థలే ఇట్లుంటే.. మరో 26 ఏం జేస్తయ్?​

తెలంగాణలో ప్రధాన నగరాల చుట్టూ సమగ్రమైన,  ప్రణాళికాబద్ధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా 26  అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీలు (యూడీఏలు)  ఒకే రోజు (15 అక్టోబర్, 2024) తెలంగాణా ప్రభుత్వం జీవోల  ద్వారా ప్రకటించింది. ఈ సంస్థల ద్వారా ప్రణాళికబద్ధ  పట్టణీకరణ  అభివృద్ధి జరగాలని  ప్రభుత్వం భావిస్తున్నది.  విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలో ఈ యూడీఏలకు  ఇచ్చిన పని  ఆయా పట్టణ  శివారు ప్రాంతాలలో సమగ్రమైన  మాస్టర్ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తయారుచేయటం, రహదారులను  అభివృద్ధి చేయటం,  నీటి సరఫరా  సదుపాయం ఏర్పాటు చేయటం, ఉపాధితో అవకాశాలు, శాటిలైట్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల వృద్ధి. ఇటువంటి ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి మంచి ఉదాహరణ  హైదరాబాద్  మెట్రోపాలిటన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అని కూడా ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

హైదరాబాద్  శివారు ప్రాంతాల అభివృద్ధి తరహాలో  ఈ 26 సంస్థలు ఆయా జిల్లాలలో పట్టణాభివృద్ధి  సాధించాలని  ఆశిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయినాయి.  ఈ 26 ఉత్తర్వులలో 5 పట్టణాభివృద్ధి సంస్థలు ఇదివరకే ఏర్పాటయ్యాయి. అయితే, వాటి పరిధి మొత్తం జిల్లాకు విస్తరించారు.  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ,  కాకతీయ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​ అథారిటీ కలిపితే రాష్ట్రం మొత్తం 28 పట్టణాభివృద్ధి సంస్థల అధీనంలోకి వచ్చింది.

ఉత్తర్వులలో  సమాచార లోపం

ప్రభుత్వ ఉత్తర్వులలో  సమగ్ర సమాచారం లోపించింది. ఈ ఉత్తర్వులు మినహా ప్రభుత్వం ఒక విధాన పత్రం కూడా ప్రకటించలేదు.  తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ఈ పంథాను ఎన్నుకున్నది?  దీనికి చట్టబద్ధత ఉన్నదా? అభివృద్ధి రచన  పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా మాత్రం సాధ్యమని  ప్రభుత్వం ప్రకటించడంలో  ఆంతర్యం ఏమిటి?  ప్రజాపాలన ప్రభుత్వంగా నిత్యం ప్రకటించుకునే ప్రభుత్వాధినేతలు అటువంటి పాలనలో తెలంగాణా పట్టణాభివృద్ధి సంస్థల పాలన ముఖ్యంగా భావిస్తున్నారా? దీనిపై స్పష్టత లేదు.  సమాచార లేమి  స్పష్టంగా కనిపిస్తుంది.  మొట్టమొదట, 26 పట్టణాభివృద్ధి సంస్థల  భౌగోళిక  విస్తీర్ణం ప్రకటించలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) 2008 సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి చెందిన చట్టం (జీ.ఓ.ఎం.ఎస్.నెం.570 ఎం.ఎ అండ్ యు.డి (11) డిపార్ట్ మెంట్, డి.టి.25.08.2008) ద్వారా 7,257 చదరపు కిలోమీటర్ల  విస్తీర్ణంలో ఏర్పడింది.

 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి..

గ్రామాలు, మున్సిపాలిటీలుఈ ఉత్తర్వులలో ఊర్లను, మునిసిపాలిటీలను  పేర్కొన్నారు.  మొత్తంగా, 6,871 గ్రామాలు, 81 మున్సిపాలిటీలు 26 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వస్తున్నాయి. రెండోది, శివారు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఇచ్చిన ఈ ఉత్తర్వులలో వాటి నిర్వచనం లేదు. పట్టణ శివారు ప్రాంతం అంటే ఏమిటి? శివారు ప్రాంతం సాధారణంగా పట్టణం నుంచి కొంత దూరం పరిగణిస్తారు. హైదరాబాద్, ఢిల్లీ వంటి మహా నగరాలకు 50 కిలోమీటర్లు ఉండవచ్చు. ఈ 26 పట్టణాభివృద్ధి సంస్థలకు సంబంధించిన పట్టణాల పరిధిలోకి మొత్తం జిల్లాను, జిల్లాలలో ఉన్న అన్ని పల్లెలను శివారు ప్రాంతం పేరు మీదప్రకటించడం ఈ ఉత్తర్వులలో ఉన్న విశేషం. 

మూడోది, ఈ సంస్థలను తెలంగాణ పట్టణ ప్రాంతాల (అభివృద్ధి) చట్టం, 1975, ద్వారా ఏర్పాటు చేశారు. అయితే ముందుగా అభివృద్ధి ప్రాంతం ప్రకటించి, ఆ ప్రాంతానికి పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చెయ్యాలి. ఆ విధంగా చెయ్యలేదు. ఈ చట్టం రాజ్యాంగంలో ఉన్న 73, 74 అధికరణలకు వ్యతిరేకంగా ఉన్నది.  ప్రజలతో సంప్రదింపులు జరపకుండా,   ప్రజాస్వామ్య  ప్రక్రియలు  ఉపయోగించకుండా ఈ చట్టం అడ్డుగా ఉన్నది.

పట్టణ అభివృద్ధి సంస్థల అధీనంలో  తెలంగాణ

26 పట్టణాభివృద్ధి సంస్థలకు చైర్మన్లు, సభ్యులు ఉంటారు. వీరిని ప్రభుత్వం నియమిస్తుంది. ఒక్కొక్క అథారిటిలో ఎంత మంది సభ్యులు ఉంటారు తదితర  వివరాలు ఈ  ఉత్తర్వులలో లేవు.  ప్రతి సంస్థలో కనీసం 10 నుంచి 15 మంది ఉండవచ్చు. అధికారులు, ఎమ్మెల్యేలు, కౌన్సిల్లర్లను తీసేస్తే, 4-5 మందిని  నియామకాలు చేయవచ్చు. అంటే, 140 మందికి రాజకీయ ఉపాధి లభిస్తుంది.  తెలంగాణ మొత్తం పట్టణ అభివృద్ధి సంస్థల అధీనంలోకి  తీసుకు వచ్చిన ఘనత  ప్రస్తుత ప్రభుత్వానికి దక్కుతుంది.

తెలంగాణలో దాదాపు 9,834 గ్రామాలు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​ అథారిటీ, కాకతీయ అర్బన్  డెవలప్​మెంట్ అథారిటీ పరిధితో పాటు కొత్తగా ఏర్పాటు అయిన 26 అర్బన్  డెవలప్​మెంట్ ఆథారిటీలలో కలిపిన గ్రామాల సంఖ్య చూస్తే దాదాపు 8,500 గ్రామాలను పట్టణ పాలనలోకి తీసుకు వచ్చింది.  మొత్తం 145 పట్టణాలు ఉండగా 116 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి వచ్చినాయి.    

హైదరాబాద్ నగరాభివృద్ధిని గాడిలో పెట్టాలి

ఇదివరకు  తెలంగాణ మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టు పేరిట తెలంగాణ  పట్టణాభివృద్ధి శాఖ 20 పట్టణ కేంద్రాల మాస్టర్ ప్లాన్లను  సవరించే పని మొదలుపెట్టింది. కామారెడ్డి,  నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి  పట్టణ ప్రణాళికలను ఆమోదించింది. భూపాలపల్లి, దేవరకొండ, అచ్చంపేట, కొల్లాపూర్,  నాగర్ కర్నూల్,  మహబూబాబాద్, ఆందోల్,  జోగిపేట్  ముసాయిదా  ప్రణాళికలు  ప్రభుత్వ ఆమోదం కోసం ఉన్నాయి.  

కొత్తగా ప్రకటించిన 54 పట్టణాల మాస్టర్ ప్లాన్లు  జూన్ 2023 నాటికి పూర్తి అవుతాయనుకున్నా,  వాటి ప్రస్తుత పరిస్థితి తెలియదు. ఆమోదించిన మాస్టర్ ప్లాన్లు కూడా వివాదంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రకటించిన 28 పట్టణాభివృద్ధి సంస్థల కూడా మాస్టర్ ప్లాన్లు తయారు చేస్తాయి.  హైదరాబాద్​లో  దాదాపు 8-9 మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 28 పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా  అభివృద్ధి నమ్మశక్యంగా లేదు. 

తెలంగాణ ప్రభుత్వానికి  చిత్తశుద్ధి ఉంటే  హైదరాబాద్ నగరాభివృద్ధిని గాడిలో పెట్టాలి. హెచ్​ఎండీఏ, హైదరాబాద్ జల మండలి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మధ్య సమన్వయం సాధించాలి. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్లను సరిదిద్దాలి. హైదరాబాద్ మెట్రోపోలిటన్ అభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధిని సరిచెయ్యాలి.  గ్రామీణ వికాసం,  ప్రజాస్వామ్య ప్రక్రియల మీద దృష్టి పెట్టాలి. సమతుల్య, సుస్థిర, పర్యావరణ అనుకూల అభివృద్ధి ప్రణాళిక రూపొందించి ప్రజల ఆమోదం తీసుకోవాలి.  ప్రస్తుతం ఉన్న పట్టణాల అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా చేపట్టే చర్యలు చేపట్టాలి.

పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి భూమి

భారత రాజ్యాంగంలో పొందుపరిచిన మూడు అంచెల  ప్రభుత్వాలలో (కేంద్ర, రాష్ట్ర, స్థానిక), మూడో అంచుకు తెలంగాణలో ముప్పు వచ్చింది.  స్థానిక  ప్రభుత్వాలుగా  రాజ్యాంగంలో పంచాయతీలకు, మున్సిపాలిటీలకు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది.  ఇప్పటికే  మున్సిపాలిటీలు,  గ్రేటర్  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సహా,   స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. 

 ప్రతిది  రాష్ట్ర  పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయిస్తుంది. ఇక  పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోకి  గ్రామ శివార్లు, పట్టణ శివార్లు తీసుకురావడంతో  రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ బలోపేతం అవుతున్నది. లక్షల ఎకరాల భూమి ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. దీని వలన అనేక అనర్థాలు పెరుగుతాయి.  పట్టణాభివృద్ధి సంస్థలపైన నిరంతర ఆడిట్ ఉండదు. నిధుల వినియోగం, దుర్వినియోగం మీద రాజ్యాంగ సంస్థల  ప్రక్రియలు పని చేయవు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్​ అథారిటీ పరిధిలోకి  దాదాపు 18 ఏండ్ల  క్రితం తెచ్చిన 1,032 గ్రామాలు, 35 మున్సిపాలిటీలలో ‘అభివృద్ధి కుంటుబడింది.  నిధుల కేటాయింపులలో పారదర్శకత లేదు. సమతుల్యత లేదు. చర్చ లేదు.

మురికినీటి వ్యవస్థ అధ్వానం

హెచ్ఎండీఎ  పరిధిలో ఉన్న గ్రామాలలో,  మున్సిపాలిటీలలో మురికినీటి వ్యవస్థ అధ్వానంగా  ఉన్నది.  హెచ్ఎండీఎకి పూర్తిస్థాయి అధికారి గత 3-4 ఏండ్ల నుంచి లేరు.  మొత్తానికి, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే సర్పంచులు, మున్సిపల్ కౌన్సిల్లర్లు, వార్డ్ మెంబర్లు అందరు ఉత్సవ విగ్రహాలుగా మారతారు. ఒక అధికారి, లేదా కొందరు అధికారుల పాలనకు  పట్టణాభివృద్ధి సంస్థలు ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుంది.   ఇక మాస్టర్ ప్లాన్ల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉన్నది.  ఒక పట్టణం  క్రమబద్ధంగా పెరగడానికి,  అందరికీ మౌలిక వసతుల ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్  ఉపయోగపడుతుంది.  కానీ, ఇప్పటి  మాస్టర్ ప్లాన్లు పట్టణ పరిధి కాకుండా శివారు ప్రాంతాల మీద దృష్టి పెడుతున్నాయి.  కేవలం పట్టణాభివృద్ధి సంస్థలకు ఆదాయం సమకూర్చడానికి ఉపయుక్తంగా తయారు చేస్తున్నారు.  తెలంగాణలో గుర్తించిన 141 పట్టణ కేంద్రాలలో అనేకం కేంద్ర మాస్టర్ ప్లాన్  రూపకల్పన  పథకంలో ఉన్నాయి.

- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్​