కొత్త జీపీలకు ఎన్నికలు జరిగేనా!

  • ఉమ్మడి జిల్లాలో 55 గ్రామాల ఏర్పాటుకు గెజిట్​జారీ
  • పంచాయతీ ఎన్నికలనిర్వహణకు కసర్తతు
  • ఆశావహల్లో అయోమయం

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,615 గ్రామ పంచాయతీలు ఉండగా 55  గ్రామాలు కొత్తగా గ్రామ పంచాయతీలుగా అప్ గ్రేడ్ కానున్నాయి. ఈ మేరకు గెజిట్ జారీ కావడంతో ప్రతిపాదిత గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు కొత్త గా ఏర్పడే గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు పోటీకి పలువురు ఆసక్తి చూపుతున్నారు.

గెజిట్ రావడంతో ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు. గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు  చేస్తోంది. ఈ మేరకు ఆపరేటర్లకు శిక్షణ, ఓటరు జాబితా సవరణ, వార్డుల విభజన ప్రక్రియ జరుగుతోంది. అయితే కొత్త జీపీలకు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారుల నుంచి స్పష్టత రావడం లేదు. దీంతో ఆశావహుల్లో అయోమయంనెలకొంది. 

మెదక్ జిల్లాలో..

మెదక్​జిల్లాలో ప్రస్తుతం 469 గ్రామ పంచాయతీలు ఉండగా 11 మండలాల పరిధిలో కొత్తగా 24 గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. మెదక్​ మండలం తిమ్మక్కపల్లి, చీపురుదుబ్బ తండా, హవేలీ ఘనపూర్​ మండలం ముత్తాయికోట, ధూప్​సింగ్ తండా, చేగుంట మండలం కిష్టాపూర్​, పాపన్నపేట మండలం కందిపల్లి, తమ్మాయిపల్లి, జయపురం, శేరిపల్లి, రామాయంపేట మండలం జమ్లా తండా, నిజాంపేట మండలం ఖాసీంపూర్​ తండా, షాకత్​పల్లి, చిన్నశంకరంపేట మండలం రామయపల్లి, ప్యాటగడ్డ, పెద్ద శంకరంపేట మండలం గట్టుకింది తండా, నర్సాపూర్​ మండలం రూప్​సింగ్​ తండా,  కౌడిపల్లి మండలం ధర్మాసాగర్ గేట్​తండా, వెంకటాపూర్​- బి, కన్నారం, పాంపల్లి, దేవులా తండా, వెల్దుర్తి మండలం శేరిలా, ఎలుకపల్లి  గ్రామాలు పంచాయతీలుగా అప్​ గ్రేడ్ కానున్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో..


సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 11 గ్రామాలు పంచాయతీలుగా అప్ గ్రేడ్ కానున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 647 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో గ్రేటర్ కు దగ్గరలో ఉన్న 11 గ్రామాలను  మున్సిపాలిటీలలో కలుపుతూ గవర్నమెంట్ ఇటీవల గెజిట్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ పక్క 11 పంచాయతీల సంఖ్య పెరుగుతుండగా మరోపక్క 11 జీపీల సంఖ్య తగ్గుతుంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం చేపడుతున్న కొత్త పంచాయతీలు 8 మండలాలకు చెందిన 11 గ్రామాలు పంచాయతీలుగా మారబోతున్నాయి.

వీటిలో కొండారెడ్డిపల్లి తండా (ఆందోల్), లక్యనాయక్ తండా (వట్ పల్లి), ఎంకేపల్లి (రాయికోడ్), తాటిపల్లి (మునిపల్లి), ముబారక్ పూర్ (బి) (సదాశివపేట), హనుమాన్ మందిర్ నాయక్ తండా, గుండు తండా, లింగనాయక్ పల్లి (నారాయణఖేడ్), పత్రనాయక్ తండా (సిర్గాపూర్), ఉమ్ల తండా, శ్యామ్ నాయక్ తండా (నాగల్ గిద్ద) ఉన్నాయి. ఇదిలా ఉండగా ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనున్న 11 గ్రామాలను సమీప రెండు మున్సిపాలిటీలలో కలుపుతూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

పటాన్ చెరు మండలానికి చెందిన పాటి, ఘనపూర్, కర్దానుర్, ముత్తంగి, పోచారం గ్రామాలను తెల్లాపూర్ మున్సిపాలిటీలో కలపనుండగా.. అమీన్​పూర్​మండలంలోని పటేల్ గూడా, కిష్టారెడ్డి పేట్, సుల్తాన్ పూర్, ఐలపూర్, ఐలపూర్ తండా, దయరా గ్రామాలు అమీన్​పూర్​మున్సిపాలిటీలో కలవనున్నాయి. కాగా మున్సిపాలిటీలో విలీనమవుతున్న 11 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించబోమని  ప్రభుత్వం చెబుతోంది. కొత్తగా ఏర్పాటు కానున్న మరో 11 పంచాయతీల్లో కూడా ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహంలో స్థానిక పొలిటికల్ లీడర్లు ఉన్నారు. 

సిద్దిపేట జిల్లాలో..

సిద్దిపేట జిల్లాలో మొత్తం 499 గ్రామపంచాయతీలుండగా ప్రస్తుతం మరో 15 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటుకానున్నాయి. సిద్దిపేట మండలం బచ్చాయిపల్లి, నారాయణరావుపేట మండలం శేఖర్​ రావ్​పేట, చిన్న కోడూరు మండలం ఎల్లమ్మ జాలు, శంకరయ్య కుంట, కమ్మర్లపల్లి, నంగునూరు మండలం సంతోష్ నగర్  దౌల్తాబాద్ మండలం పోసానిపల్లి, జగదేవపూర్ మండలం  రమణ నగర్, బెజ్జంకి మండలం  రామ్ సాగర్, అక్కన్నపేట మండలం కెప్టెన్ తండా, శ్రీరామ్ తండా, చోట కుంట తండా, దాసు తండా, సేవాలాల్ మహారాజ్ తండా, హతిరం నాయక్ తండా కొత్త జీపీల జాబితాలో ఉన్నాయి.