తెలంగాణలో ఫుడ్ పాయిజన్ ఘటనలతో సర్కార్ అలర్ట్

  • విద్యా సంస్థల్లో తనిఖీల కోసం ఫుడ్ సేప్టీ కమిటీల ఏర్పాటు
  • ఫుడ్ పాయిజన్లపై నిగ్గు తేల్చనున్న టాస్క్ ఫోర్స్ కమిటీలు
  • ఆహార భద్రతపై స్కూళ్లలో ఏఎన్ఎం, హెడ్ కుక్, టీచర్​కు శిక్షణ

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా స్కూళ్లు, హాస్టళ్లలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో సర్కార్ అలర్ట్ అయింది. ఇప్పటి వరకు జరిగిన ఫుడ్ పాయిజన్​ ఘటనలకు గల కారణాలు తెలుసుకోవడంతోపాటు.. అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లాలో రెండు ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. 

పర్యవేక్షణ లేకపోవడం వల్లనే..

పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకపోవడంతో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. గతంలో నేరడిగొండ, భీంపూర్ కేజీబీవీ, ఆదిలా బాద్ రూరల్ కేజీబీవీ, బండల్ నాగాపూర్ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. అధికారులు నామమాత్రం తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

 దీంతో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో క్వాలిటీ పెరగడం లేదు. కూరగా యలు, ఆకుకూరలు, కోడిగుడ్లు, అరటి పండ్లు వంటి పౌష్టికాహరం అందించాల్సి ఉన్నప్పటికీ.. మెను ప్రకారం అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఎంఈవోలు, హెచ్ఎంలు పట్టించుకోకపోవడం వల్ల నాణ్యత లేని భోజనాన్నే విద్యార్థులు తినాల్సి వస్తోంది. దీంతో ఫుడ్​పాయిజన్​కు గురవుతున్నారు. ఈ ఘటనలతో ప్రభుత్వం సీరియస్ అయింది. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ, టాస్క్ ఫోర్స్ కమిటీలతో తనిఖీలు చేపట్టనుంది.  

ఫుడ్ సేఫ్టీ కమిటీల్లో ఎవరెవరంటే..

జిల్లాలో రెండు ఫుడ్ సేఫ్టీ కమిటీలను కలెక్టర్​ఏర్పాటు చేశారు. మొదటి కమిటీలో టీమ్​లీడర్లుగా ఐటీడీఏ పీవో, అడిషనల్ కలెక్టర్, సభ్యులుగా ఉట్నూర్ ఏజెన్సీ అడిషనల్ డీఎంహెచ్​వో, డ్రగ్ ఇన్​స్పెక్టర్, డీఎస్వో, ఎస్సీ డెవలప్ మెంట్ ఆఫీసర్, టీటీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డీపీవో, సీడీపీవోలను నియమించారు.

ALSO  READ : నవంబర్ 30న సర్కారు స్కూళ్లు బంద్: ఎస్ఎఫ్ఐ

 ఈ కమిటీకి ఏజెన్సీ మండలాలైన ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ, గుడిహత్నూర్, ఇచ్చోడ, బోథ్, నేరడిగొండ, సిరికొండ మండలాలను కేటాయించారు. రెండో కమిటీలో టీమ్ లీడర్ గా అడిషనల్ కలెక్టర్, సభ్యులుగా డీఎంహెచ్​వో, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ డీసీవో, బీసీ డెవలప్​మెంట్ ఆఫీసర్, ఎంజేపీటీబీసీ స్కూల్ ఆర్సీవో, డీసీవోలను నియమించారు. వీరికి ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్ అర్బన్, మావల, జైనథ్, బేల, భీంపూర్, బజార్​హత్నూర్, తలమడుగు, తాంసి మండలాలను కేటాయించారు. 

చేయాల్సిన తనిఖీలు ఇవే..

ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం స్కూళ్లలో మధ్యాహ్న భోజనంపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే  కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, డీఈవో ప్రణీత మధ్యాహ్న భోజనం నిర్వహణను తనిఖీ చేస్తున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఇకపై విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని ఫుడ్ సేఫ్టీ కమిటీ తనిఖీలు చేయనుంది. నివేదికను ప్రతివారం కలెక్టర్​కు అందజేయాల్సి ఉంటుంది. మల్టీ డిసిప్లినరీ టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటుచేసి గత రెండేళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగిన హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి అందుకుగల కారణాలు, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు.

 ప్రభుత్వ హాస్టళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి  ఆహార పదార్థాల నిల్వ, వంట పాత్రల పరిశుభ్రత, ఆహారం వడ్డించడం తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. వంట చేసే వ్యక్తుల శుభ్రత, వారి ఆరోగ్యం ఎలా ఉందనేదానిపై కమిటీ సభ్యులు ఆరా తీయాల్సి ఉంటుంది. ఒక ఏఎన్ఎం, హెడ్ కుక్, టీచర్​కు భోజన నాణ్యత పరిశీలించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. 

ప్రతి స్కూల్​లో ఒక టీచర్​తో పాటు ఇద్దరు విద్యార్థులను లీడర్లుగా నియమించి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి స్కూల్ లో కంప్లయింట్ బాక్స్ ఏర్పాటు చేయాలి. 15 రోజులకోసారి దాన్ని ఓపెన్ చేసి చర్చించి మినట్స్ రిజిష్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇకపై విద్యార్థులకు ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్​లు చేయనున్నారు.