నామినేటెడ్ పోస్టులపై నజర్ ముమ్మర ప్రయత్నాల్లో నేతలు

  •     ఏఎంసీ, సుడా పదవులకు పోటాపోటీ
  •     గజ్వేల్​లో ఆసక్తికర రాజకీయాలు 

సిద్దిపేట, వెలుగు : నామినేటెడ్ పోస్టులపై ప్రభుత్వం దృష్టిపెట్టడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు తమదైన రీతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని మార్కెట్ కమిటీలు, సుడా, గ్రంథాలయ చైర్మన్, కొమురవెల్లి ఆలయ చైర్మన్, డైరెక్టర్ పోస్టులు ఆశిస్తున్న నేతలు కాంగ్రెస్​ముఖ్య నేతల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. కాంగ్రెస్  అధికారంలో లేనప్పుడు పార్టీనే నమ్ముకుని  పనిచేశామని తమకు నామినేటెడ్ పోస్టు కేటాయించాలని జిల్లా మంత్రులు, ముఖ్య నేతలను కలుస్తున్నారు.

సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ నియోజకవర్గాల పరిధిలోని ఏఎంసీ, సుడా, గ్రంథాలయ చైర్మన్, డైరెక్టర్ పోస్టులను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో  ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మరో రెండు వారాల్లో ఆషాడం ముగుస్తుండడంతో నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మార్కెట్ కమిటీ పోస్టులపై నాయకుల కన్ను

మార్కెట్ కమిటీల్లో పోస్టులు దక్కించుకునేందుకు పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 14 మార్కెట్ కమిటీలుండగా సీనియర్, జూనియర్ నేతలు మంత్రులు, ఎమ్మెల్యేలకు దరఖాస్తులు అందజేస్తూ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.  ఒక్కో  మార్కెట్ కమిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 16 మందిని డైరెక్టర్లుగా నియమిస్తారు.

ఇప్పటికే  మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులకు రిజర్వేషన్లు ప్రకటించగా 8 జనరల్,  2  జనరల్ మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఒక్కో స్థానాన్ని రిజర్వ్ చేశారు. మార్కెట్ కమిటీల్లో స్థానం దక్కించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమం అవుతుందని మెజార్టీ నేతలు భావిస్తున్నారు.

సుడా చైర్మన్ కోసం పోటాపోటీ

సిద్దిపేట అర్బన్ డెవలప్​మెంట్​అథార్టీ(సుడా) చైర్మన్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. సుడా చైర్మన్ పోస్టు చేజిక్కించుకుంటే రాజకీయంగా తమ పలుకుబడిని పెంచుకోవచ్చని భావిస్తున్నారు. డిసెంబర్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు అరడజను మంది నేతలు సుడా చైర్మన్ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమకే పోస్టు దక్కుతుందనే సంకేతాలు షేర్​చేస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో  సిద్దిపేట నియోజకవర్గంలో  ప్రొటోకాల్ లభించడం తోపాటు భవిష్యత్ రాజకీయాల కోసం దీన్ని వేదికగా చేసుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ లో సుదీర్ఘంగా పనిచేస్తున్న నేతలతో పాటు ఇటీవల పార్టీలో చేరిన వారు సైతం సుడా చైర్మన్ పోస్టును ఆశిస్తున్నారు. 

ఆసక్తికరంగా గజ్వేల్ రాజకీయాలు
నామినేటెడ్ పోస్టుల విషయంలో గజ్వేల్ కాంగ్రెస్ లో రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నియోజకవర్గం పరిధిలోని ఐదు ఏఎంసీ పాలక వర్గాల ఎంపిక పై రెండు గ్రూపులు తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో పోస్టులు ఎవరికి దక్కుతాయా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి శ్రీకాంత్ రావు నామినేటెడ్ పోస్టులు తమ వర్గానికే దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, జగదేవ్ పూర్, కొండపాక ఏఎంసీ పాలక వర్గాలు ఖరారైనా గ్రూపు రాజకీయాల వల్ల జాబితాల ప్రకటనను  పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. రెండు గ్రూపుల నేతలు జిల్లాకు చెందిన మంత్రులు, ఇన్​చార్జి మంత్రులతో పాటు పార్టీ  ముఖ్య నేతలను  కలుస్తూ  తమ వర్గానికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.