25 వేల ఎకరాల్లో ఇంటి పంట .. హైదరాబాద్​లో టెర్రస్ గార్డెనింగ్​పై సర్కార్ దృష్టి

  • సాగుకు కావాల్సినవన్నీ సమకూర్చేందుకు సన్నాహాలు 
  • ‘వన్ స్టాప్ సొల్యూషన్’ పేరుతో అందుబాటులోకి..
  • ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఉద్యాన శాఖ 
  • మిద్దె తోటల సాగుకు హైదరాబాద్ వాతావరణం అనుకూలమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: టెర్రస్ గార్డెనింగ్​పై సర్కార్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్​తోపాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్​లాంటి పెద్ద నగరాల్లో మిద్దె తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ప్రధానంగా హైదరాబాద్​లోని బిల్డింగులపై పెద్ద ఎత్తున పంటలు సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ భావిస్తున్నది. నగరంలో దాదాపు 25 వేల ఎకరాల్లో మిద్దె పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ప్రజలు తమ ఇంటి డాబాలపై, ఇంటి ఆవరణలోని ఖాళీ జాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు, మెషినరీ, ఇతర సామగ్రి అందజేయడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది.

 మిద్దె తోటల సాగుకు కావాల్సిన వస్తువులన్నీ ‘వన్‌‌‌‌స్టాప్ సొల్యూషన్’ పేరుతో అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఒక యూనిట్ కు అయ్యే ఖర్చులో 50 శాతం సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది.  రూఫ్​టాప్​గార్డెనింగ్​కు హైదరాబాద్ లోని వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ‘‘హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉంటాయి. సగటు వర్షపాతం​890 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ సమతుల్యమైన వాతావరణం కూరగాయలు, పూలు, పండ్లు పండించేందుకు అనుకూలంగా ఉంటుంది” అని అంటున్నారు. 

Also Read :- ధూల్​పేట్ లో పతంగుల సందడి

‘‘ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తున్నది. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్​లో పెద్ద ఎత్తున బిల్డింగులు ఉన్నాయి. ఆయా బిల్డింగుల డాబాల మీద మిద్దె పంటలు సాగు చేస్తే.. జనం ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందవచ్చు.  హైదరాబాద్​లోని ఇండ్లపై ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణం లెక్కిస్తే వేల ఎకరాల్లో ఉంటుంది. ఇందులో కనీసం 25 వేల ఎకరాల్లో పంటల సాగు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం” అని అధికారులు తెలిపారు. నగరవాసులు తమ ఇండ్ల డాబాలపై  కూరగాయలు, పూలు, పండ్లు పండించేందుకు ఆసక్తి చూపిస్తే తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ‘‘ప్రజలు డాబాలపై సేంద్రియ కూరగాయలు పండించుకోవచ్చు. పండ్లు, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. ఇలా స్వచ్ఛంగా పండిన వాటిని తినడానికి వాడుకోవడంతో పాటు మిగితావి అమ్ముకోవచ్చు” అని పేర్కొన్నారు. 

డాబాలపై ఏమేం పండించుకోవచ్చంటే.. 

కూరగాయలు: టమాటా, వంకాయ, బెండకాయ, క్యాప్సికం, క్యాబేజీ, క్యాలిఫ్లవర్‌, గోరు చిక్కుడు, ఫ్రెంచ్‌ బీన్స్‌దుంప రకాలు:- క్యారెట్‌, బీట్‌రూట్‌, చామగడ్డ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ
తీగ రకాలు: బీరకాయ, సోరకాయ, కాకరకాయ, పొట్లకాయ, చిక్కుడు, గుమ్మడి ఆకుకూరలు: పాలకూర, తోటకూర, చుక్కకూర, కరివేపాకు, మెంతికూర, కొతిమీర, పుదీనా, బచ్చలికూర, గోంగూర  పండ్లు: బొప్పాయి, దానిమ్మ, సపోట, అంజీర్‌, బత్తాయి, స్ట్రాబెర్రీ, అరటి, నిమ్మ, ద్రాక్ష పూలు: గులాబీ, బంతి, చామంతి, లిల్లీ, మందార, మల్లెలు, జాజి రకాలుఔషధ మొక్కలు: నల్లేరు, రుద్రాక్ష, కలబంధ, ఉసిరి, తులసి, ఉత్తరేణి, కానుగ

రాయితీలు ఇవ్వాలి

టెర్రస్‌ గార్డెన్‌లు నగరవాసులకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తాయి. తినడానికి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అలంకరించుకోవడానికి పూలు, పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తే చాలామంది టెర్రస్‌ గార్డెనింగ్‌కు ముందుకొస్తారు. 

హర్కర శ్రీనివాస్​, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్​టెర్రస్​గార్డెన్స్

ప్రభుత్వం సబ్సిడీ అందించాలి

చాలామంది టెర్రస్ గార్డెనింగ్ కు ముందుకొస్తున్నారు. వాళ్లకు ప్రభుత్వం సబ్సిడీ అందించాలి. రాయితీ మీద విత్తనాలు, కుండీలు, స్ర్పేయర్లు, ఇతర సామగ్రి అందిస్తే అర్బన్ ఫార్మింగ్ మరింత పెరుగుతుంది. 

ఖాలీద్​అహ్మద్​, హార్టీకల్చర్​ఎక్స్ పర్ట్