- శివ్వారం టూరిజం సర్క్యూట్‌గా సర్కార్ నిర్ణయం
- అభివృద్ధిపై పర్యాటకుల ఆశలు
కోల్‌బెల్ట్, వెలుగు: సహజ ప్రకృతి అందాలు.. చారిత్రక ప్రాంతాల అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. కొత్తగా ఎకో టూరిజం పాలసీ తీసుకొస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా 17 సర్క్యూట్లలో 64 ఎకో టూరిజం స్పాట్లుగా గుర్తించగా వీటిలో మంచిర్యాల జిల్లాలోని చారిత్రాత్మక గాంధారి ఖిల్లా, మొసళ్ల మడుగు (ఎల్‌మడుగు)కు చోటుదక్కింది. ఈ ప్రాంతంలో పర్యాటకులకు మరింత ఆహ్లాదం పంచడంతో పాటు సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి, ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళికలు రెడీ చేసింది. అందులో శివ్వారం సాంక్చురీ పరిధిలో గాంధారి ఖిల్లా, అర్బన్‌పార్కు, శివ్వారం ఎల్ మడుగును పర్యాటక ప్రాంతాలుగా డెవలప్ చేయనుంది. ఇక్కడున్న గాంధారి కోట, అబ్దురపరిచే కట్టడాలు, ఎల్‌మడుగు మొసళ్ల సంరక్షణ కేంద్రం, గాంధారి వనాన్ని కలిపి ఒక సర్క్యూట్‌గా తీర్చిదిద్ది సందర్శకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించనుంది.
700 ఏండ్ల చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లా
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట గ్రామశివారులోని దట్టమైన అటవీ ప్రాంతంలో 700 ఏండ్ల చరిత్ర కలిగిన గాంధార ఖిల్లా ఉంది. 300 మీటర్ల ఎత్తయిన గుట్టపై కాకతీయులు, పద్మనాయక రాజులు నిర్మించిన గాంధారి ఖిల్లాపై నిర్మించిన కోటలో ఎన్నో అబ్బురపరిచే కట్టడాలు, కళారూపాలు, శిల్ప సంపద, విగ్రహాలు, ఆలయాలను చూడొచ్చు. గాంధారీ మైసమ్మ, కాలభైరవుడు, శివుడు, సదర్ల భీమన్న, విఘ్నేశ్వరుడు, పదడుగుల ఎత్తయిన ఆంజనేయుడు, భీముడి పాదాలు, ఏకశిల నాగశేషుడు, ఏనుగుల విగ్రహాలున్నాయి. కొండపై బండను తొలచి నిర్మించిన నాగశేషుడి ఆలయం, 8 అడుగుల ఎత్తుతో 12 పడగల ఏకశిల నాగశేషుడి విగ్రహం ఉంది. ఏటా ఫిబ్రవరిలో నాయక్‌పోడ్‌ల ఆధ్వర్యంలో మూడు రోజులు ఇక్కడ మైసమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తారు.
సహజ ప్రకృతి అందాల శివ్వారం ఎల్‌మడుగు
గలగల పారే గోదావరి ఒడ్డున పచ్చని చెట్లు, కనుచూపు మేర నీటి ప్రవాహం, ఎటు చూసినా ప్రకృతి రమణీయత ఉట్టిపడే ప్రదేశం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం-పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్మధ్యలో ఎల్‌మడుగు (మొసళ్ల మడుగు) ఉంది. గోదావరి తీరంలో ఏడాది పొడవునా జలకళతో నిండి ఉంటుంది. 1982లో అటవీశాఖ ఏర్పాటు చేసిన ఈ మడుగు 15 కిలోమీటర్ల మేర గోదావరి నది తీరాన విస్తరించి ఉంది.
ఇందులో 40కి పైగా మంచినీటి, ఉప్పునీటి మొసళ్లున్నాయి. వేలాదిగా నీటి కుక్కలు, తాబేళ్లు, వివిధ రకాల పక్షులు విహరిస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఎల్ మడుగులో మొసళ్లను చూసేందుకు పర్యాటకుల కోసం శివ్వారం వైపు బోటును అందుబాటులో ఉంచారు. సమీపంలోని గుట్టపై వాచ్‌టవర్‌ను నిర్మించారు. ఈ టవర్ నుంచి ఇక్కడి ప్రకృతి అందాలు, మొసళ్ల మడుగును చూడవచ్చు.
ఆకట్టుకుంటున్న అర్బన్ పార్కు
గాంధారి ఖిల్లాకు వెళ్లే మార్గంలో రాష్ట్ర సర్కార్ఏర్పాటు చేసిన గాంధారి వనం అర్బన్‌పార్కు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మంచిర్యాల-మందమర్రిలోని నేషనల్ హైవే 363 ఫోర్లేన్రహదారిలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ బొక్కలగుట్ట బస్టాప్ వద్ద ఉన్న గాంధారి మైసమ్మ ఆలయం ఆవరణలో సుమారు 400 ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో వేలాది జాతుల మొక్కలు, నర్సరీ, స్మృతివనం, రాశీవనం, ఔషధవనం, యెగా కేంద్రం, జింకల సంరక్షణ కేంద్రం, బోటు విహారం, వాచ్ టవర్, 5 కి.మీ. పొడవు వాకర్స్ట్రాక్ ఏర్పాటు చేశారు. ఎకో టూరిజం పాలసీలో ఈ పార్కు మరింత అభివృద్ధి కానుంది.