ఆర్టీసీలో త్రీమెన్ కమిటీ భేటీ ఎప్పుడు? వెరిఫికేషన్ కొనసాగుతోందన్న ఆర్టీసీ

  • తొలగించిన ఉద్యోగులను తీసుకోవడంపై రెండు వారాల కింద కమిటీ ఏర్పాటు
  • ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాని కమిటీ

 హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో వివిధ కారణాలతో తొలగించిన సుమారు 500 మంది ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేసింది. కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కన్వీనర్ గా,  సెర్ప్ సీఈవో, ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ కమిటీ మెంబర్ గా త్రీమెన్ కమిటీని నియమిస్తూ ఈ నెల 12న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీని  నియమించడంతో వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన డ్రైవర్లు, కండక్టర్లలో కొత్త ఆశలు చిగురించాయి. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపుతూ తమను అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారని బాధితులు పలువురు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు.

ఇలాంటి ఫిర్యాదులు ప్రజావాణిలో 3 వందలకు పైనే రావడంతో నోడల్ అధికారి దివ్య దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యంగా బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు న్యాయం చేసే దిశగా త్రీమెన్ కమిటీని నియమించింది. కమిటీ నియామకంతో ఇక తమను తిరిగి సర్వీసుల్లోకి తీసుకుంటారని బాధితులు సంబరాలు చేసుకున్నారు. కానీ రెండు వారాలు దాటినా ఈ కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాకపోవడం, బాధిత ఉద్యోగుల విషయంలో ముందడుగు పడకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.  

వెరిఫికేషన్ కొనసాగుతోందన్న ఆర్టీసీ  
తొలగించిన ఆర్టీసీ ఉద్యోగులను తిరిగి తీసుకోవడంలో జాప్యంపై పలు కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  అసలు ఈ కమిటీని ఎందుకు వేసినట్లు అని నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు మాత్రం తమకు న్యాయం జరిగిందన్నట్లుగా ప్రజా భవన్ లో స్వీట్లు పంచుకున్నారని ఆరోపిస్తున్నారు. తొలగించిన ఉద్యోగులను తీసుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే కమిటీ సమావేశమై బాధిత ఉద్యోగులపై ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేవలం కాలయాపన కోసమే ఈ కమిటీని వేశారని అనుకోవాల్సి వస్తుందన్నారు.

అయితే, త్రీమెన్ కమిటీ కన్వీనర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనారోగ్య కారణాలతో మూడు వారాల పాటు సెలవులో ఉన్నందుకే కమిటీ సమావేశం నిర్వహించలేదని యాజమాన్యం చెప్తోంది. అయినా, తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకునేందుకు వెరిఫికేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, సజ్జనార్ తిరిగి విధుల్లో చేరగానే కమిటీ సమావేశమై తగిన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంటోంది.