తెలంగాణలో మరో కొత్త పథకం.. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’.. ఏడాదికి రూ.12 వేలు..

వరంగల్: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రైతు భరోసాపై కూడా మరోమారు కీలక ప్రకటన చేశారు. ప్రతి ఎకరాకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసాను ప్రభుత్వం ఇస్తుందని స్పష్టం చేశారు. జనవరి 26 నుంచి రైతు భరోసాను పంపిణీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఎవరు అడ్డు పడినా.. ఎన్ని కుట్రలు చేసినా రైతు భరోసాను ఇచ్చి తీరుతామని నొక్కి వక్కాణించారు.

బీఆర్ఎస్ గత 10 ఏండ్లలో ప్రజలను మోసం చేసిందని, ధనిక రాష్ట్రాన్ని చేతిలో పెడితే లక్ష రూపాయల రుణమాఫీ కూడా చేయలేకపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ 7 లక్షల అప్పు చేసి కూడా రుణమాఫీ చెయ్యలేక చేతులు ఎత్తేసిందని, ఇచ్చిన హామీలను నిబద్ధతతో కచ్చితంగా అమలు చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. 2లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాకపోతే తప్పకుండా చేస్తామని హామీ ఇచ్చారు.

హరీష్ రావు, కేటీఆర్ కాంగ్రెస్పై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావుల మాటలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 56 వేల మందికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని, రైతులకు బోనస్ ఇచ్చి కాంగ్రెస్ ప్రోత్సాహిస్తుందని భట్టి గుర్తుచేశారు.

సోషల్ మీడియాలో, వాళ్ళ పత్రికలో BRS విషప్రచారం చేస్తుందని, ప్రతి ఎకరాకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి మరోమారు స్పష్టం చేశారు. రైతుల పక్షానే కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందని, ఇచ్చిన మాటలను నిలబెడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు తలెత్తుకునేలా ప్రభుత్వం చేసిందని, కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి కార్యకర్తలు తీసుకెళ్ళాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.